sriguru.org.in
ఆయాచితం నటేశ్వర శర్మ

ఆయాచితం నటేశ్వర శర్మ

💥🚩 *కోలాచల మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల-సంస్థాన విశిష్టకవులు… పరిపృచ్చ

నేటి మా కళాపీఠం విశేష ఆచార్య కవిశ్రేష్ఠులు సంస్కకతాంధ్ర భాషాప్రవీణులు అవధానీ

మాన్యశ్రీ ఆయాచితం నటేశ్వర శర్మ గారి పరిచయంలోకి పయనిద్దాం

విశిష్టకవులు-2

బి వెంకట్ కవి మల్లినాథసూరి సంస్థాన సభ్యులు చేసిన పరిపృచ్ఛ ఇది

👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼
బి.వెంకట్ కవివరా: మన మల్లినాథసూరికళాపీఠం ఏడుపాయల సమూహానికి ఈ రోజు ముఖ్య అతిథిగా మన మధ్యలో సంస్కృతాంధ్రభాషల్లో అనంతమైన ప్రజ్ఞానం గలవారైన మహా నీయులు
ఆచార్య డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మగారు ఉన్నారు .పరిపృచ్ఛకు సిద్ధంగా ఉన్నారు .

ఈ గురూత్తములు మనకు మార్గనిర్దేశకులు .ఈ మహానీయుల జీవిత సత్యాలను. జీవితానుభవములను మనము తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము .వీరి అపారమైన జ్ఞాన -విజ్ఞాన -ప్రజ్ఞాన -తాత్విక -భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుందాము .

భారతీయ సంస్కృతికి సంస్కృతం ప్రతిబింబం .’ అయితే ‘తేనెలొలుకు తీయనైనభాష తెలుగు .ఈ ద్విభాషలు వీరికి ద్వినేత్రాలు .సమాజ -కళా – సాహిత్య -సాంస్కృతిక –ఆధ్యాత్మిక సేవల ప్రతిరూపం వీరు.జీవనరేఖల చారుచర్యలు , అమరవాణి -తెలుగుభాషల వైభవాల సేవానిరతిని మనము తెలుసుకుందాము .ఇక పరిపృచ్ఛలోనికి వెళ్ళుదామా !!!

వెంకట్- మహానీయా ప్రణామాలు .

  1. ఆచార్య ! మీ కుటుంబనేపథ్యమును వివరించగలరా ?

జ)..మాది ‘అయాచిత’ వంశం.వేదంలో అయాచిత శబ్దం ఉంది.యాచించిన ద్రవ్యాన్ని కలవారు యాచితులు.యాచించిన ద్రవ్యం కాకుండా స్వార్జితంతో ధనాన్ని సమకూర్చుకొన్నవారు అయాచితులు.అలాంటి ఉత్తమ గుణాలు గల పూర్వుల నేపథ్యం
మా వంశానిది.అందుకే మా ఇంటి పేరు అయాచితం అయింది.
మా పూర్వ పురుషు లందరూ అలాగే పవిత్రజీవనం గడిపినవారు.యజ్ఞ యాగాదులను ఆచరించి అగ్ని సదృశ పవిత్ర గుణాలు కలవారు.అలాంటి వంశంలో నేను పుట్టడం నా అదృష్టం. పూర్వ జన్మ సుకృత ఫలం.

  1. మహానీయా ! మీ కుటుంబం వివరాలు వింటుంటే మీది పండితవంశమని తెలుస్తుంది ..మీ పూర్వీకుల వివరాలు , మీ వ్యక్తిగత వివరాలు తెలుపగలరా ?

జ). ముత్తాత శివరామశర్మగారు.ఆయన మా ప్రాచీన శివాలయానికి ప్రధానార్చకులు. వేదవిద్యానిధి.ఆజీవన పర్యంతం శివార్చనలో తరించినవారు.మా తాత రాజేశ్వరశర్మగారు కృష్ణయజుర్వేదాన్ని అధ్యయనం చేసి నిత్యం వైదికతా పూతమైన సంస్కారాలను చక్కగా చేస్తూ, ఇతరులతో చేయిస్తూ ‘స్వయం తీర్ణా: పరాంస్తారయన్తి’ అన్న విధంగా నైష్ఠికజీవనాన్ని గడిపినవారు.మా తండ్రి అనంతరాజశర్మగారు వృత్తిరీత్యా అధ్యాపకులై ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.జ్యోతిష ధర్మ శాస్త్రాలలో నిష్ణాతులు.అనేక యజ్ఞయాగాలను ఆచరించారు.ఎన్నో దేవాలయాల ప్రతిష్ఠలు చేశారు.మా ప్రాంతంలో వారి విద్వత్తు అందరికీ పూజ్యభావంగా ఉండేది.ఎంతటి జటిల ధర్మసందేహాన్ని అయినా సశాస్త్రీయంగా చెప్పగలగడం వారి వైదుష్యప్రతిభకు నిలువెత్తు నిదర్శనం.మా తండ్రి గారికి నేను పెద్దకొడుకును.నన్ను ముందుకు నడిపించడంలో మా నాన్నగారి కృషి మరువలేనిది.మా తండ్రి ఆశయానికి అనుగుణంగా నేను సంస్కృత విద్యలను అభ్యసించాను.ఆ విధంగా మా నాన్నగారి ఆకాంక్షను నెరవేర్చాననే సంతృప్తి నాకు మిగిలింది.ఈ జీవితానికి నాకు అది చాలు

  1. గురువర్యా ! మీ బాల్యవిద్య మరియు ఉన్నతవిద్య ను ఎక్కడెక్కడ పూర్తి చేశారు ? మీ విద్యార్హతలు వివరించగలరా ?

జ).నేను ఆరవ తరగతి వరకే మా ఊరి బడిలో చదువుకున్నాను.1967 లో మా తండ్రి గారి ప్రోత్సాహంతో తిరుమలలోని శ్రీవేంకటేశ్వర వేద సంస్కృత పాఠశాలలో సంస్కృతం ఎంట్రెన్స్ లో చేరి అక్కడే ఆరు సంవత్సరాలు సంస్కృత విద్యాధ్యయనం చేశాను.1973 లో తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో వ్యాకరణ శిరోమణి టైటిల్ కోర్సులో చేరి నాలుగేండ్లు వ్యాకరణశాస్త్రాన్ని అధ్యయనం చేశాను.1977 లో వ్యాకరణశిరోమణిలో విశ్వవిద్యాలయ ప్రథముడిగా కృతార్థుడనయ్యాను.ఇదీ నా విద్యాభ్యాసం.
1977 తరువాత ఉస్మానియా విశ్వ విద్యాలయం లో సంస్కృతం బి.ఓ.ఎల్.ఆ తరువాత సంస్కృతం, తెలుగు భాషలలో ఎం.ఏ., పట్టాలను అందుకున్నాను.సంస్కృతంలో ఎం.ఫిల్,,పిహెచ్.డి., పూర్తిచేశాను.నా ఎం.ఫిల్ .పరిశోధన ఆముక్తమాల్యద చంపూకావ్యంపై సాగగా, పిహెచ్.డి.,శంకర భగవత్పాద కృత సౌందర్యలహరిపై సాగింది.పిహెచ్.డి.లో స్వర్ణపతకం లభించింది.

4.ఆచార్య ! మీ జనన ఊరు. తేదీ .తెలుగు సంవత్సరం అమ్మానాన్నల పేర్లు , కుటుంబసభ్యులు , పిల్లలు. బాల్యం , ప్రస్తుతం -అన్ని వివరించగలరా ?

జ).కామారెడ్డి జిల్లా,రామారెడ్డి గ్రామంలో 1956 జూలై 17 వ తేదీన జన్మించాను.ఆరోజు తెలుగు పంచాంగాన్ని అనుసరించి దుర్ముఖి నామ సంవత్సరం ఆషాఢ శుక్ల ఏకాదశి (శయనైకాదశి లేదాపెద్ద ఏకాదశి) అవుతుంది.
మా తల్లిదండ్రులు జయలక్ష్మీదేవి,అనంతరాజశర్మ.మా తల్లిదండ్రులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. మొదటి సంతానం మా అక్క భారతీదేవి.ఆ తరువాత నేను కొడుకులలో పెద్దవాణ్ణి. నా తరువాత వరుసగా నాగరాజశర్మ,రాజేశ్వరశర్మ,శివప్రసాదశర్మ అనే ముగ్గురు.ఆ తరువాత చెల్లెలు వాణిశ్రీ.
మాకు ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి కౌముది.రెండవ అమ్మాయి జాహ్నవి.మూడవ అమ్మాయి యామిని.
నా భార్య అరుణకుమారి.మా వివాహం 1977 మే 14 వ తేదీన కామారెడ్డిలో జరిగింది.నా అత్తమామలు తిగుళ్ల పద్మావతి,వేంకటేశ్వరశర్మ.

నా భార్య అరుణకుమారి తెలుగు ఉపాధ్యాయినిగా పదవీవిరమణ చేసింది.ఆమె మంచి కవయిత్రి.కథారచయిత్రి.ఆమె కవితాసంపుటి ‘అరుణకిరణాలు’ .
మా కుటుంబంలో మా అక్క భారతీదేవి లలిత గేయ రచయిత్రి.ఆమె ఈ మధ్యనే మరణించింది. పెద్దతమ్ముడు భౌతికశాస్త్రంలో అధ్యాపకుడుగా పనిచేసి పదవీవిరమణ పొందాడు.మంచి గాయకుడు.సంగీతంలో ప్రవేశం ఉంది.రెండవ తమ్ముడు డాక్టర్ రాజేశ్వరశర్మ తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు చిన్నతమ్ముడు శివప్రసాదశర్మ ఆంగ్లోపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.చెల్లెలు వాణిశ్రీ తెలుగు ఉపాధ్యాయిని.

5.గురువర్యా ! వసుధైక కుటుంబం -అనే భావనతో మీ కుటుంబాన్ని పోల్చుతూ నేటి సమాజానికి ముఖ్యంగాయువతకు ఎలాంటి సందేశమివ్వాలనుకుంటున్నారు . దయతో వివరించగలరా

జ)..’అయం నిజ: పరో వేతి
గణనా లఘుచేతసామ్
ఉదారచరితానాం తు
వసుధైవ కుటుంబకమ్’
అన్నాడు భర్తృహరి మహాకవి.మా కుటుంబం ఈ సూక్తిని ఆదర్శంగా తీసుకొంటున్నది.సమాజంలో అందరితోనూ స్నేహ సౌజన్యాలను పంచుకోవడం, అవసరమైతే యథాశక్తిగా సహకరించడం, అనుభవాలను పంచుకోవడం మా కుటుంబానికి అలవాటు.సమాజంలో ఎన్నో వైవిధ్యాలుంటాయి..అభిప్రాయభేదాలుంటాయి.వాటిని సమన్వయంతో పరిష్కరించుకొంటూ సంయమనంతో సాగడమే మా కుటుంబానికి తెలుసు.ముఖ్యంగా నేటి యువత స్వదేశాభిమానాన్నీ,స్వసంస్కృతి వికాసాన్ని కోరుకోవాలి.క్షణికమైన సుఖాలకూ ప్రయోజనాలకూ విలువైన జీవితాన్ని బలి చేయకూడదు.సంస్కారాన్ని పెంచుకోవాలి.బాధ్యతలను గుర్తించాలి.అందరికీ వీలైనంతలో సహాయపడాలి.భవిష్యత్తును ప్రణాళికతో నిర్మించుకొని ముందుకు సాగాలి.అలవోకగా ఏదీ రాదు.కృషి చేయడం,ఉత్తమఫలితాలను అందుకోవడం లక్ష్యం కావాలి.క్షణికావేశాలకు పూనుకోరాదు.ఇదే యువతకు అందించే నా సలహా.

  1. ఆచార్య ! మీ సహధర్మచారిణి అరుణకుమారి కవయిత్రిగా కథారచయిత్రిగా సమాజంలో రాణించడానికి మీ సహకారం ఉండే ఉంటుంది .’అరుణకిరణాలు ‘కవితా సంపుటిలో ఏ కోణం దాగి ఉంది ?.
    జ). నా సహధర్మచారిణి సహజంగానే మంచి భావుకురాలు.ఆమెలో సృజనకళ అనేక విధాలుగా ఉంది.ఆమెకు నేను ప్రోత్సాహం అందిస్తున్నాను.ఉపాధ్యాయినిగా , కవయిత్రిగా, రచయిత్రిగా ఆమె ప్రతిభావంతురాలు. ఆమె రచించిన ‘ అరుణ కిరణాలు’ లో సామాజికత,అనుభూతి, ఉపదేశం, ప్రబోధం ఇత్యాద్యంశాలు పుష్కలంగా ఉన్నాయి.

7 మహానీయా ! మీరు సంస్కృతం మీడియంలో విద్యను అభ్యసించారు కదా ! వ్యాకరణముపై పట్టు ఎట్లా కలిగింది .ఓరియంటల్ కళాశాలలో చేరడానికి మిమ్ములను ఎవరు ప్రోత్సహించారు వివరించగలరా ?

జ).నేను సంస్కృత విద్యను అభ్యసించడానికి ప్రేరణ,దోహదం చేసింది మా తండ్రిగారే.ఆయనకు నన్ను సంస్కృత విద్వాంసునిగా చూడాలనే కోరిక ఉండేది.అందుకే ఎన్నో కష్టాలు పడి నన్ను తిరుమలలోని శ్రీవేంకటేశ్వరవేదసంస్కృతపాఠశాలలో చేర్పించారు.ఆయన ప్రోత్సాహం కారణంగానే నేను వ్యాకరణశిరోమణిని అయ్యాను.

8 గురువుగారు ! అన్నిభాషలకు సంస్కృతం అమ్మభాష .భారతస్య ప్రతిష్ఠితం ద్వే సంస్కృతం సంస్కృతిః .సంస్కృతం నామ దైవీ వాక్ .అన్ని భాషలకు మూలం సంస్కృతం .–ఈ సూక్తులను క్రోడీకరిస్తూ -మీరు సంస్కృతంలో ఏ ఏ శాస్త్రాలు కావ్యాలు. పురాణాలు , వేదాలు తదితరము అభ్యసించారు అవి మిమ్ములను ప్రభావితం ఎట్లా చేశాయి?

జ).సంస్కృతం అమరభాష.అమరులు అంటే దేవతలు.దేవతలు మాట్లాడే భాష కనుక సంస్కృతం అమరభాషగా ప్రసిద్ధి చెందింది.భారతదేశం అనాదిగా సంస్కృత భాషకు నిలయం.ఇక్కడ దేవతలు సంచరించినట్లు పురాణేతిహాసాల కథనం.కనుక భారతదేశానికి ప్రతిష్ఠను తెచ్చేవి సంస్కృతం,సంస్కృతి అని ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతి:’ అనే నానుడి వ్యాప్తి చెందింది.అన్ని భాషలకు మూలం సంస్కృతం అని చెప్పలేము కానీ చాలా భాషలకు మూలాలు సంస్కృతంలో ఉన్నాయనే మాట వాస్తవం.ముఖ్యంగా తెలుగు భాషకు సంస్కృతం మాతృక.సంస్కృతం లేకుంటే తెలుగుకు వైభవం ఉండదు.అంతగా ఈ రెండు భాషలూ పెన వేసు కొని ఉన్నాయి.అపారసంస్కృతవాఙ్మయంలో నేను చదివినవి చాలా తక్కువ.ఇంకా చదువవలసింది ఎక్కువ.

9 *గురువర్యా ! తెలుగువెలుగు తెలుగుభాష వైభవ ప్రాభవం అన్వయిస్తూ మీరు చదివిన తెలుగుభాష కావ్యాల గురించి వివరించగలరా ?

జ).తెలుగుభాష ఎంతో తీయనిది తెలుగు భాషను గూర్చి ఎంత చెప్పినా తక్కువే తెలుగులో ప్రాచీనాధునిక సాహిత్యానికి ఎంతో వైవిధ్యం ఉంది.కవిత్రయ భారతం మొదలుకొని నేటిదాకా వెలువడిన సాహిత్యంలో కొన్నింటిని చదివాను.చదివిన వానిలో నుండి ఎంతో స్ఫూర్తిని పొందాను.ఆ స్ఫూర్తితోనే ఉభయ భాషలలోనూ సృజనలు చేయగలుగు తున్నాను నాకు సంస్కృతం తెలుగు రెండు కళ్ల వంటివి. వాటి ఆధారంగానే నేను సాహిత్యలోకాన్ని దర్శించ గలుగు తున్నాను.

10 *గురువర్యా ! ఉద్యోగమే పరమావధిగా భావించిన మీరు వృత్తిధర్మాన్ని ఎలా పాటించారు ?

జ).జ).నేను 1977 లో కామారెడ్డి ప్రాచ్య కళాశాలలో సంస్కృతోప న్యాసకునిగా ఉద్యోగంలో చేరాను.2014 లో పదవీ విరమణ చేశాను.36 సంవత్సరాలకు పైగా నా వృత్తా ధర్మాన్ని బాధ్యతాయుతంగా నెర వేర్చాను.సమయపాలనం నా నిత్యకృత్యంగా ఉండేది.తరగతిగదిలోకి వెళ్లిన తరువాత బాహ్యప్రపంచాన్ని మరచిపోతాను.పాఠాన్ని ఎంత రమణీయంగా, సమగ్రంగా చెప్పాలో సాధన చేసి తెలుసుకున్నాను.అలాగే బోధించాను.నా విద్యార్థులు నా పాఠం కోసం నిరీక్షించే విధంగా వారిని ప్రభావితం చేశాను.విద్యార్థుల హృదయాలలో గురుత్వస్థానాన్ని అలంకరించాను.

  1. *ఆచార్య ! మీ సాహిత్య సృజన రచనలు ఎప్పుడూ ప్రారంభించారు ?

జ).నా సృజనలకు బీజం తిరుమల శ్రీవేంకటేశ్వర వేద సంస్కృత పాఠశాలలోనే పడింది.1972లో దీపావళి పర్వదినం నాడు విద్యార్థులకు సంస్కృతంలో కవితాస్పర్ధలు మా గురువులుపెట్టారు.ఆనాడు నేను దీపావళి పైరాసిన ఎనిమిది అనుష్టుప్ శ్లోకాలు నాకు బహుమతిని తెచ్చిపెట్టాయి..నాటినుండి నేను చేపట్టిన కలానికి నేటిదాకా తిరుగులేదు పుంఖాను పుంఖాలుగా సంస్కృతాంధ్ర భాషలలో ఇప్పటికీ సృజనలు చేస్తూనే ఉన్నాను.

12 *ఆచార్య ! మీరు ఇప్పటివరకు ఎన్ని గ్రంథాలు ఆవిష్కరించారో పేర్లతోసహా వివరించగలరా?

జ).నేను సంస్కృతాంధ్రభాషలలో కలిపి అరవైదాకా రచనలు చేశాను.వాటి జాబితా ఇది:

1.వసంతకుమారి
2.శ్రీగజాననస్తోత్రమ్
3.శ్రీషోడశీ
4.భారతీప్రశస్తి
5.ఆముక్తమాల్యదపరిశీలనము
6.సమయవిలాసిని
7.శ్రీశివమహిమ్నవ్యాఖ్య
8.ఋతుగీత
9.నవ్యగీతి
10.బాలరామాయణము మొదలగు అరవైదాకా చేశాను

13 *గురువర్యా ! మీ అనంతమైన ప్రజ్ఞ రచనవిశేషాలు మరియు సాహిత్యరంగానికి యోగదానం చెప్పగలరా ?

జ).నా రచనలన్నీ నైతికతనూ,మానవతనూ పెంపోందించేవిగానూ, సంస్కరణలను ఆశించేవి గానూ, ఆధ్యాత్మిక,సానస్కృతిక మూల్యాలను పెంచేవిగానూ ఉంటాయి.సాహిత్యరంగంలో యువతను ప్రోత్సహించడం, సాహిత్య కార్యక్రమాల రూపకల్పన ద్వారా నవ్యతను ఆహ్వానించడం ప్రధానాశయం.అవధానాల ద్వారా,రేడియో ప్రసంగాలద్వారా, ఉపన్యాసాల ద్వారా సమాజంలో ఉత్తమగుణాలను నెల కొల్పడమే నా ప్రధానాశయం.

14 *ఆచార్య! మీ రచనల్లో మీకు నచ్చినవి ?

జ).నా రచనలన్నీ నాకు సంతృప్తిని ఇచ్చినవే.వాటిలో శ్రీషోడశీ, సమయవిలాసిని, భారతీప్రశస్తి, ఋతుగీత, పంచశరీయమ్, శ్రీ వేంకటేశ్వరవిలాసము, శకుంతల, నూట పదహారు, నవ్యగీతి, చుక్కలు, భారతీయ శతకము, నవ్యనీతిశతకము, కవితాశతకం, ప్రభాకరశతకమ్ నాకు ఎక్కువగా నచ్చిన రచనలు.

15 *మహానీయా!మిమ్ములను జీవితంలోమరియుసాహిత్యంలో ప్రభావితం చేసిన వ్యక్తులు ?

జ).నా జీవితాన్ని ప్రభావితం చేసిన మొదటి వ్యక్తులు మా తల్లిదండ్రులు. తరువాత నా గురువులు.

16.కవివరేణ్యా ! మీకు నచ్చిన సంస్కృతకావ్యాలు గ్రంథాలు ?

జ).సంస్కృతాంధ్రసాహిత్యాలలోని ప్రాచీనకావ్యాలన్నీ నాకు నచ్చినవే.ముఖ్యంగా కాళిదాస,శంకరభగవత్పాదుల సాహిత్యంఅంటే నాకు అత్యంతప్రీతిపాత్రం.

17 *కవిశ్రేష్ఠా !మీకు నచ్చిన తెలుగుసాహిత్యం?

జ).తెలుగుసాహిత్యంలో కవిత్రయభారతం, పోతన భాగవతం, అష్టదిగ్గజకవుల రచనలు, ప్రబంధాలు, శతకాలు,సినారె,దాశరథి సాహిత్యాలంటే మక్కువ.

18.పండితపుంగవా! ప్రపంచాన్న్నిసైతం ప్రభావితం చేస్తున్న ఈనాడు అంతర్యామి వ్యాసాలూ ఎలా వ్రాయగలుగుతున్నారు ?

జ).నా ‘అంతర్యామి’ వ్యాసాలకు నేపథ్యం నా నిరంతరాధ్యయన రచనా వ్యాసంగమే.నాకు తెలిసిన స్వల్పజ్ఞానాన్ని నూతనకోణంలో పాఠకులకు అందించాలని నా అభిలాష.ఏది రాసినా చిక్కగా, చక్కగా రాయడం నాకు ఇష్టం.అంతర్యామి వ్యాసాలు నైతికతా ప్రబోధానికీ, ఆధ్యాత్మిక వికాసానికీ, వ్యక్తిత్వ సంస్కరణకూ దోహదం చేయాలనేదే
నా ఆకాంక్ష.

19.మహోపన్యాసక ! ప్రాచ్యకళాశాల అధ్యాపకులుగా విద్యార్థులకు యువతకు స్ఫూర్తినీ అందించిన అంశాలు చెప్పగలరా ?

జ).నేను ప్రాచ్యకళాశాలలో అధ్యాపకునిగా ప్రాచ్యవిద్యలలో నా విద్యార్థులను నిష్ణాతులును చేయాలని నేను నిరంతరం యత్నించాను.నా వలన స్ఫూర్తిపొందిన నా విద్యార్థులు ఉపాధ్యాయులై తమ విద్యాబోధనలో నా శైలిని అనుసరించడం నాకు తృప్తినిచ్చిన అంశం.

20.సాహిత్య పరిశోధకా ! మీ అధ్యయనం అధ్యాపనం పరిశీలనం పరిశోధనం అనుశీలనం ఎలాంటివో వివరిస్తారా ?

జ).నేను సాహిత్యాధ్యయనం పట్ల ఎప్పుడూ ఆసక్తిని పెంచుకుంటున్నాను.అధ్యయనం, అధ్యాపనం నాకు రెండు కళ్లవంటివి.అధీతి,బోధ, ఆచరణ, ప్రచారాల వల్లనే సాహిత్యం మనగలుగుతుందని నమ్మేవాణ్ణి నేను.అదే దారిలో యాభైఏళ్లుగా ప్రయత్నిస్తున్నాను.ఆముక్తమాల్యదపై, సౌందర్యలహరిపై నేను చేసిన పరిశోధనలు అమూల్యమైనవి.

తదుపరి రెండవ భాగం ప్రకటన కై మీ ఎదురుచూపుల కన్నా ముందు మీ స్పందనని ఆశిస్తుళహన్నాం

అమరకుల దృశ్యకవి
సమీక్షకులు

బి వెంకట్ కవి నిర్మల్
పరిపృచ్చ నిర్వహణ
&
గీతా శైలజ ఆల్వాల్
ఎడిటింగ్ విభాగం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *