Kavi Parichyam

శ్రీ వెంకట శంఖ చక్ర గదాదర్ రావు

💥🌈 మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన కవులపరిచయం

విశిష్టమైన కవుల ఆవిష్కరణ
🌈💥💥💥💥💥🌈
ఆణిముత్యమంటి కవులను తెరపై ఆవిష్కరించ బూనింది
మల్లినాథసూరి కళాపీఠం
ఆ ప్రక్రియలో భాగంగా ఓ తాత్విక అక్షర తపస్వి మా మితృలు
శ్రీ వెంకట శంఖ చక్ర గదాదర్ రావు
గారిని పరిచయం చేస్తుంది . ఈయన మా కళాపీఠం దత్తత తీసుకున్న సంస్థాన కవులలో ఒకరు.. దాదాపు ప్రతి వారం ఒక సంస్థాన కవులు పేర ఒకరి పరిచయం చేయబడుతుంది.. వీరిని పెద్దలు శ్రీ రామబ్రహ్మం చారు నల్గొండ గారు పరిచయం పరిపృచ్చ నిర్వహించగా

నాతో(అమరకుల దృశ్యకవి) పాటు కళాపీఠం సభ్యురాలు శ్రీమతి గీతాశైలజ ఆల్వాల్ గారు ఎడిటింగ్ లో తోడ్పడ్డారు . వారికి ధన్యవాదాలు.

గదాధర్ గారి పరిపృచ్ఛ 1.వ భాగం:

చదవండి…… 👇🏼

1).రామబ్రహ్మం:మీ వ్యక్తిగత వివరాలు, వృత్తి
ప్రవృత్తి తెలియ జేస్తారా….?

జ). అరిగెల:నా పూర్తి పేరు శ్రీ వెంకట శంఖ చక్ర గదాధరరావు.నేను సుందర సాగర తీరమైన విశాఖపట్నం లో నివాసముంటున్నాను.వృత్తి రీత్యా మేనేజర్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేయు చున్నాను.ప్రవృత్తి సాహితీ సేద్యం. ఇప్పటి వరకు దాదాపు 500 పాటలు,1500 కవితలు వ్రాసాను.

2).రామ బ్రహ్మం:ఎంతవరకు చదువుకున్నారు…?

జ).అరిగెల:ఎ.ఎమ్.ఐ.ఐ.ఎమ్ కలకత్తా ఇన్సిటిట్యూట్ నుండి
మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్
చేసానండి.డిప్లమో ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ లోను పి.జి.డి.సి.ఎ. పాండిచ్చేరి యూనివర్సిటీ నుండి చదివియున్నాను.

3).రామ బ్రహ్మం:మల్లినాథసూరి కళా పీఠం వారు మిమ్మల్ని ఆహ్వానించారా
లేక, మీరే పరిచయ మయ్యారా?

జ).అరిగెల:అమరకుల వారు నాకు తెలుగు కళావైభవంలో పరిచయం. ఆ పరిచయం అనుబంధమై ఆత్మీయ స్నేహమై పెరిగింది.
నా కుటుంబానికి పరిచయ మున్న ఏకైక మిత్రులు అమరకుల గారని గర్వంగా చెప్పగలను.ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు గా ఏర్పరచిన మల్లినాథసూరి కళాపీఠానికి
స్వయంగా ఆహ్వానించడం కొన్ని బాధ్యతలు అప్పజెప్పడం నేను ఆనందంగా ఒప్పుకోవడం జరిగింది.అమరకుల గారితో
నా సాహిత్య పయనం ఓ అద్బుతమైన అనుభవం.సంతృప్తినిచ్చుచున్న సాహిత్య పయనం.

4).రామ బ్రహ్మం:మీకు సాహిత్యం పై అభిలాష
ఎలాకలిగింది?

జ).అరిగెల:ఎక్కువ నవలలు చదవడం అనుకోకుండా ఆలోచనలో వచ్చిన భావానికి అక్షరాలు అద్దడం ఆదిలో అలవాటయ్యింది.కాలేజీ చదువుతున్న రోజులనుండి కవిత్వం వ్రాస్తున్నాండి.మొదటగా యవ్వనంలో భావ కవితలు.తరువాత విప్లవ సాహిత్యం ఇలా వ్రాసేవాడిని.మెదట్లో శ్రీ శ్రీ గారి ప్రభావం నా పై ఉండేది.మంచి చూసినా చెడు చూసినా విన్నా మనసుకు హత్తుకున్న దానిని ఒత్తిడికి గురి చేసినదానిని పువ్వుల్లాంటి అక్షరాలుతో సూదిలాంటి పెన్నుతో మాలకడతా.స్పందించే గుణం నా నైజం.ఇది నిజం.. నిజం.

5).రామబ్రహ్మం:మీ కుటుంబంలో మరెవరి
కైనా సాహిత్య సంబంధాలు
ఉన్నాయా?

జ).అరిగెల: లేదండీ.బహుశా మా వంశంలోనే
నేను ప్రధమ కవిని.

6).రామబ్రహ్మం:మల్లినాథసూరి కళా పీఠం
నిర్వహణ తీరు పై స్పందన?

జ).అరిగెల:అద్భుతః.రాయల సాహిత్య సభలా మల్లినాథసూరి కళాపీఠం నాకు అనిపిస్తుంది. వివిధ ప్రక్రియలతో తెలుగు కవుల మరియు కవయిత్రుల కవన పటిమను వెలుగులోకి తేవడంలో సఫలం అయ్యారని చెప్పగలను.ఒక కమిటీ ఏర్పాటు చేయడం ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పజెప్పడం సమిష్టిగా నిర్వహించడంలో అమరకుల గారి కృషి శ్లాఘనీయం.ఒక మహోపాధ్యాయుడి ఉనికిని సాహిత్య ప్రపంచానికి గుర్తు చేయడం గతంలో ఆయన సాహిత్య కృషిని వెలుగులోకి తీసుకు రావడంలో విశేష కృషి జరుపుతున్నారనడంలో సందేహం లేదు.

7).అమరకుల గారికి సాహిత్య
ప్రక్రియలపై సూచనలిస్తుంటారా
వారే నిర్ణయాలు చేస్తారా?

జ).అరిగెల:సాహిత్య ప్రక్రియలన్నీ అమరకుల గారు ప్రవేశ పెట్టినవే.సూచనలు అవసరం రాలేదు కాని నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విషయాలు తెలియజేస్తుంటారు.నాకు తెలిసినంత వరకు మంచిగానే ఉంటాయి కాబట్టి నేను అనుసరిస్తాను.

8).రామబ్రహ్మం:ఆయన కవుల గురించి ఆలో
చిస్తుంటారు గాని, తనుమాత్రం
సన్మానాలు, పొగడ్తలకు దూరం
గా ఉంటారు.నిజమేనా?

జ).అరిగెల:ఏకవిలో ఏరకమైన ప్రక్రియ దాగి ఉన్నది వివిధ అంశాలలో ఎవరు ఎలా స్పందించగలరు అనే విషయంలో చక్కని అవగాహన ఉన్న కవి అమరకుల గారు.
నాకు తెలియదు నేను తాత్వికతాంశము బాగా వ్రాయగలను అని ఆయన చెబితేనే తెలిసింది. ఇక పొగడ్తలు సన్మానాలకు ఆయన సహజంగా దూరమే.మన మేమిటో మన అక్షరమే చెబుతుంది అని నేను తరచుగా అటుంటాను.దానితో ఆయన పూర్తిగా ఏకీభవిస్తారు.

9).రామబ్రహ్మం:పట్టున్న కవులను వదిలి పెట్ట
రనుకుంట?

జ).అరిగెల: బాగా ప్రోత్సాహిస్తారు.వీలయినంత వరకూ పట్టు ఉన్న కవులకు పట్టాభిషేకం చేయడం లో ఆయనకు ఆయనే సాటి.స్వార్ధ చింతనతో వంటెద్దు పోకడలో ఉంటే మాత్రం ఏమాత్రం బ్రతిమలాడరు.వదిలేసుకోవడానికైనా సిద్దమే.అక్షరాన్ని నమ్మకున్న సాహిత్య దిగ్గజం ఆప్యాయతలో శిఖరం అమరకుల.ఇచ్చిన విలువ నిలబెట్టుకోవడం మన మీద కూడా ఆధారపడి ఉంటది కదా.అడవిలో నాకన్నా పెద్ద వృక్షం లేదని
అంగుళం కూడా కదలలేని తరువు విర్రవీగడం ఎంతో హాస్యాస్పదం కదా!
దానిని దృష్టిలో ఉంచుకుని చేయి తిరిగిన రచయతలు మసలు కోవాలనేది నా అభిప్రాయం.

10 రామబ్రహ్మం:.సాహిత్యం తో సమాజానికి ఉపయోగం ఉందంటారా?

జ).అరిగెల: అద్బుతమైన ప్రశ్న రామబ్రహ్మం గారు.
మంచి రచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి.జన గళాన్ని అక్షర రూపంలో తీసుకొచ్చి ఉద్యమం చేయగల సత్తా కవులకుంది.నేటి సామాజిక స్థితులపై అవగాహనతో వ్రాసే కవులు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతారు.లక్ష్యానికి సూచనలను తమ కవిత్వం ద్వారా అందించగల మేథావులు కవులనడంలో అతిశయోక్తి లేదు. మన సంప్రదాయ సంస్కృతుల పరిరక్షణకు దేశభక్తిని నింపడానికి కవుల పాత్ర ఎంతో ఉంటుంది.అక్షరం అగ్నికణమై అవినీతిని ప్రశ్నించగలదు.పాలకుల పాలనలోని లోపాలను ఎత్తి చూపగలదు.
సమ సమాజ స్థాపనకు సాహిత్యం ఒక వజ్రాయుధం అని చెప్పగలను.స్వేచ్ఛగా కవి తన అనుభాలను కొంత కాల్పనికతను ముందు చూపును జోడించి అందించిన కవనాలెన్నో యువతకు మార్గదర్శకాలు గా
నిలిచాయి. వ్యక్తిత్వ వికాసానికి విజయానికి మెట్లయి నిలిచాయి.
అపజయంలో ఓదార్పుకి మనలో మార్పుకి
సాహిత్య ప్రభావం ఉంటుందని నేను ఘంటా పధంగా చెప్పగలను.

11.రామబ్రహ్మం:విద్యార్థులు పుస్తకాలపై,
చదువరులు పత్రికలపై చూపుతున్న శ్రద్ధ సాహిత్యం పై లేదని నా అభిప్రాయం. ఔనా,
కాదా?

జ).అరిగెల: అవుననే చెప్పవచ్చును.
మార్కులు,ర్యాంకులు లక్ష్యంగా సాగుతున్నాయి నేటి చదువులు.నేను విద్యార్థి దశలో ఎన్నో పుస్తకాలు చదివాను.కాని ఇప్పటి విద్యార్థులకు ఆ పరిస్థితి లేదు.అంతా వత్తిడిలో చిత్తవుతున్నది బాల్యం. పెద్దవారు కూడా ఏదో వార్తల కోసం వార్తాపత్రికలు తిరగేస్తున్నారుకాని పక్ష పత్రికలు,మాస పత్రికలు చదవడం మానేసారు.ఇక మంచి నవలలు సంకలనాలు చదివే వారి సంఖ్య రాను రాను తగ్గుతుందనే ఆవేదన నాలో ఉన్నది.దీనికి కారణం యాంత్రిక జీవనం,అనుబంధాలుతరిగిపోవడం డబ్బుకి ఎక్కువ విలువనివ్వడం కారణంగా కావొచ్చు.

12.రామబ్రహ్మం:రచయితలు మార్పుకోసం
రచనలు చేస్తున్నా, ప్రభత్వం నుంచికాని, పెద్దల నుంచి గాని తగిన ఆదరణ అంతగా లేదని
అనుకునున్నాను మీరు దీన్ని ఏకీభవిస్తారా…?

జ).అరిగెల: ఇది కొంతవరకూ నిజమే కాని ఎవరో ప్రోత్సాహిస్తారని ఎదురు చూసేదానికన్నా మంచి రచనలకు గుర్తింపు ఉంటుంది అని నా అభిప్రాయం. వాట్సాప్ వేదికగా అందరూ కాదు కాని కొందరు వ్రాస్తున్నది అసలు కవిత్వమేనా అనిపిస్తుంది. మనలో సత్తా ఉంటే ఆ రచన ఖచ్చితంగా పాఠకులను మెప్పించగలదు.
ఇక ప్రభుత్వ ప్రోత్సాహమంటారా అంతంత మాత్రంగానే ఉంటున్నది. రాజకీయ కోణాలేకాని సమాజోద్దారణ కోణాలు కానరావడం లేదు.

13.రామ బ్రహ్మం:మీరు చేసిన కవితలు పుస్తక రూపంలోకి వచ్చాయా..?

జ).వివిధ సంస్థలు ముద్రించిన పది పైన సంకలనాలలో నాకవితలు వచ్చాయి.దాదాపు పదిహేను వందల కవితలు వ్రాసిన నేను స్పందన అనే నా కవితల సంకలనానికి శ్రీకారం చుట్టినా అముద్రితం గానే మిగిలి పోయింది.భవసాగరంలో సాగుతూ బంధాల అలలపై తేలుతూ కొంత ఆర్ధిక వనరులు సమకూరక మొత్తం మీద సొంతంగా అయితే ముద్రణ జరగలేదు.కాని ఏదొ చెప్పుకోవడం కోసం ముద్రించేయడం అనే ముగ్గులోకి మాత్రం నేను దిగలేదు.ఆ మాయా యావలో నేను చిక్కుకోలేదు.చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీకి వ్రాసిన పాటలు మాత్రం సిడి రూపంలో నాడు విడుదల అయ్యాయి.మా స్టీల్ ప్లాంట్ సావనీర్ లలో చాలా కవితలు ముద్రితమయ్యాయి.ఇక స్వంతంగా పూర్తి నా సాహిత్యం తో త్వరలోనే ఒక సంకలనం కోసం ప్రయత్నిస్తున్నాను.అంతా ఈశ్వరేచ్ఛ.

14.స్థానిక పత్రికల్లో గాని ఇతర
పత్రికల్లో గాని ప్రచురితం అయ్యాయా? వాటిపై అభిమానులు స్పందించారా?

జ).వివిధ వార్తా పత్రికలు మాస పత్రికలు ఇంటర్నెట్ లలో అనేక కవితలు వచ్చాయి.విశాఖ లోకల్ వివిధ చానళ్ళ లలో నా ఇంటర్యూలు వచ్చాయి.ఆకాశవాణి విశాఖపట్నం లో కూడా నా కవితలు ప్రసారమయ్యాయి. వార్త విశాఖపట్నం ఎడిషన్లో నలభై వారాలు టాపిక్ మాది కవిత మీది అంశం పై వ్రాసాను.ఈనాడు పత్రికలో వైష్ణవి అని కలం పేరుతోను అరిగెల గదాధర్ అని స్వంత పేరుతోను వివిధ సందర్భాలలో వ్రాసాను.ప్రతీ ఉగాదికి పత్రికలలో విశాఖపట్నం జిల్లా ఎడిషన్స్ లో వస్తూనే ఉంటాయి.అభిమానులకు కొదవేం లేదు.చాలా మందికి విశాఖపట్నం ప్రత్యేకంగా గాజువాక జోన్లో ప్రజలతో పరిచయం ఉన్నది.ఉభయ తెలు రాష్ట్రాలలో అభిమానులు ఏకలవ్య శిష్యులుగా నన్ను అభిమానించి గురువుగా స్వీకరించిన వారు సలహాలను సూచనలను ఫోన్లలో సంప్రదించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.అలా అని నేనే గొప్ప అని కాదు కాని శర్వాణి దయతో
మంచి పేరు రావడం నా పూర్వ జన్మ సుకృతం

15.రామ బ్రహ్మం:మీకు బాగా నచ్చినవి,
అవార్డులు , రివార్డులు అందించినవి ఉన్నాయా?

జ).చాలా సందర్భాలు ఉన్నాయండి.

1.విశాఖ ఉక్కు కర్మాగారం సి.డబ్లు.సి.వారు ఇచ్చే ఉగాది పురస్కారం మరువలేనిది.
2.స్టీల్ క్లబ్ వారు అత్యుత్తమ రచయితగా చేసిన భారీ సన్మాం నేను నడయాడిన సొంత గడ్డపై అందుకున్న పురస్కారం అపురూపం
3.తెలుగు కళా వైభవం శ్రీ మేక రవీంద్ర గారి ద్వారా కవిమిత్ర,కవిరత్న,కవి విభూషణ బిరుదులు పొంది ఉన్నాను
4.గురజాడ పౌండేషన్ వారినుండి రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నాను.
5.సాహితీ స్రవంతి ఏర్పాటు చేసిన శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా వ్రాసిన పాట ప్రధమస్థానంలో నిలవడం సత్కారం
6.రచనా సమాఖ్య బొబ్బిలి వారి చేతుల మీదుగా
7.ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో పురస్కారం ఇలా ఎన్నీ సంతృప్తి కర సంఘటనలు

ఎన్నో సన్మానాలు అన్నీ మనసుకి సంతృప్తి నిచ్చినవే…ముఖ్యంగాన అమరకుల దంపతులు మల్లినాథసూరి కళాపీఠం ద్వారా సత్కరించడం మరువలేని మరపురాని మధురమైన మదిన నిలిచే మహోన్నత ఘట్టం!

17.ఇతర ప్రముఖ రచయితల
పుస్తకాలు చదువుతారా, శ్రీ శ్రీ
గారివి కాక?

ఆరిగెల:చిన్నప్పటి నుండి ఎన్నో రచనలు చదివాను.చిన్నప్పుడు మధుబాబు డిటెక్టివ్ రచనలు యండమూరి వీరేంద్రనాథ్, కొమ్మనాల్లి గణపతిరావు, యుద్దనపూడి సులోచనారాణి,చలం,గుంటూరి శేషేంద్ర శర్మ,,తిలక్,రవీంద్రనాథ్ ఠాగూర్, అడివి బాపిరాజు,ఆరుద్ర,సినారె,గురజాడ, గుర్రం జాషువా, బోయి భీమన్న,పురిపండా వారు,గొల్లపూడి,తనికెళ్ళ భరణి,శిచారెడ్డిఇలా ఎందరో మహానుభావులు అందరికీ అరిగెల పాదాభి వందనాలు.ఒక యోగి ఆత్మకథ నన్ను ఆలోచనలలో పడేసింది.రిచ్ డాడ్ పూర్ డాడ్,ద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారీ రాబిన్ శర్మ గారి రచనలు చదివి ఉన్నాను.

18.తెలంగాణలో చిన్నా చితక
అనేక సాహితీ సంస్థలున్నాయి. ఎవరికి వారు
కృషికొనసాగిస్తున్నారు కాని,
కవుల్లో అంతగా స్పందన లేదన్నది వాస్తవం కాదా?
సన్మానాల కిచ్చిన సమయం రచనల పట్ల లేదనుకుంటా?

జ).ఖచ్చితంగా అంటాను.మనం వ్రాసినవి నలుగురు చదవగానే బాగుందని మెచ్చుకోవాలి.ఆలోచన చేయగలగాలి.మీరన్నట్లు ఉభయ తెలుగు రాష్ట్రాలలోను ముఠా మేస్త్రి లాంటి అడ్మిన్లతో చిన్నా చితక ఎన్నో సమూహాలు సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అడ్మిన్ లను చూసినా వారి కవిత్వం చూసినా నాకయితే నవ్వొస్తది.నాలుగు అక్షరములు కలిపి విలక్షణంగా వ్రాయ రాదు సాహితీ సమూహాలు సాహిత్య పీఠాలు సాహితీ లోకానికి తలవంపులు తెస్తున్నాయి.మంచి ఉద్దేశంతో రచయితలను ప్రోత్సాహించిన మరియు మరుగున పడిన చేయితిరిగిన కవులను బయటకు తెచ్చిన ఘనత మాత్రం తెలుగు కళా వైభవం మేక రవీంద్ర గారిదని చెప్పడానికి గర్వపడుతున్నాను.ఆయన సమూహాలకు నేను సమన్వయ కర్తగా ఉండుట నాకు దొరకిన గొప్ప అవకాశం. కొందరు వ్యాపార ధోరణితో కొన్ని ప్రలోభాలకు లొంగి వ్రాసే వాటిలో రాసులే తప్ప వాసి ఉండుట లేదు.కొందరు ఏమి సాధించారో తెలియదు కాని ఎన్ని సన్మానాలో ఎన్ని కార్యక్రమంలో వీరిని చూస్తుంటే అసలు వీరికి సిగ్గులేదా అనిపిస్తుంది.వాక్యాలను విరగగొట్టి కవితనుకోవడం నిజంగా అమాయకత్వం లేదంటే అతి గడుసుతనం…..శ్రమైక జీవన విధానాన్ని చెబుతూ నేను “చమట మింగిన బట్ట నాకాభరణం” అన్నాను…”నాన్న అనే జ్ఞాన లాంతరు పట్టుకుని నడిచాను”
“కష్టం తన కంఠంలో దాచే ఇంకో శివుడే నాన్న” “అమ్మ భూలోక బ్రహ్మ” “నాకలం పోతురాజు చేతిలో ఖడ్గం ఎత్తాల్సింది నీవే ఆది శక్తి అవతారం” అని ఆడుచారిని ఉద్దేశించి ఇలా ఎన్నోరకాలుగా సందర్భాలను అక్షరీకరించాను.కవిత్వ రసాస్వాదనలో మునిగి తేలిన నాకు కొన్ని సమూహాలని సంస్థలని చూస్తే ఆశ్చర్యం మేస్తుంది.

16.రచనా విభాగాల్లో ఏది ఇష్టం… భాషల్లో ఏ భాషపై
మక్కువ ఎక్కువ.?

జ).రచనా విభాగాల్లో నాకు కవితలు మరియు పాటలు ఇష్టం. పాటంటే ప్రాణమని చెప్పవచ్చు. తాత్వికతా ధోరణిలో సాగే కవన గానం మనసుకి ప్రశాంతత కలుగ జేస్తుంది. మనమెవరు.ఎందుకొచ్చాం…ఎక్కడికి వెళ్ళిపోతాం అదే నిరంతర అంతర్మధనం.ఆకోవలోనే నాకవితలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. పాటలలో
సినిమాకు వ్రాయాలనే కోరిక ఎక్కువ.వ్రాసాను కూడా.మొత్తం గా చెప్పాలంటే సాహిత్యమే నా ఆస్తి ఆయువు కూడా.ఇక ఓపిక లేని నేటి యువతరం కోసం కవన గుళికలు ప్రక్రియ నేనే మొదలు పెట్టాను.నాచే నామకరణం చేయ బడిన చిట్టి పొట్టి గట్టి కవితలు అంటే మరీ ఇష్టం.
మనసా వాచా నా మాతృభాష అయిన తెలుగు భాషే నా పంచ ప్రాణాలు.అంతే కాదు కృష్ణ పరమాత్మను ప్రేమగా పిలవాలి.దానికి నాచే క్రొత్త పదం సృష్టించ బడాలి.అది ఎంత ప్రేమగా ఆప్యాయతల పిలుపు అవ్వాలంటే అమ్మానాన్నలు తమ బిడ్డను ముద్దుగా పిలిచేటట్లు ఉండాలి.అబ్బాయి అఖిల్ అనుకోండి అఖిలమ్మా అని పిలుస్తారుగా….కిరణ్ అయితే కిరణమ్మా అంటారు గా మరి కృష్ణమ్మ అయితే పాత పేరు మరి ఎలా అమ్మ శర్వాణీ దయతో కృష్ణిక అని ఒక పేరు సృష్టిచాను.పెద్దలు దీవించారు

19.నేటి కవులలో పసలేదంటారా….!నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారంటారా….కవిత్వం స్తబ్దత పొందినదంటారా….!

జ).దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూఒప్పుకోనండి.ఎందరో మహానుభావులు గతంలో వ్రాసారు.నేడు వ్రాస్తున్నారు.భవిష్యత్తులో కూడా వ్రాస్తారు.ప్రోత్సహించడంలో మాత్రం నిర్లక్ష్యం ఉన్నదనే చెప్పుకోవాలి.కవిత్వం స్తబ్దత పొందదు….కాని మనుష్యులే యాంత్రిక జీవనంలో యంత్రాలై పోతున్నారు.కలం గర్జిస్తూనే ఉంది తరతరాల అంతరాలు తొలగించమని కాని మనసులే మూగబోయాయి.కాలికి గజ్జెకట్టి డప్పు కొట్టి పదంతో కదం తొక్కమని కలం నూరిపోస్తూనే ఉంది చైతన్యం.గళాలు మూగబోయి ఎవరో వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నారు.కాలాన్ని ఒడిసి పట్టుకోవాలి.నిజం తెలిసి కదిలే లోపున కనులు తెరచి చదివే లోపున చేజారి చెరిగిపోయే కావ్యం కాలం…వర్తమానంలో
అందుకుంటేనే మార్పు సాధ్యం…! సరైన స్పందనకు ఊతమివ్వడమే సమాజ లక్ష్యం
అయితే అసాధ్యం మాత్రం ణకాదు.

20.సన్మానాలతోనే సంతృప్తి పడతారా….! మీ సాహిత్య ప్రస్థానం దిశ ఎటు వైపు…మీ కవన ప్రస్థానం దిశ లక్ష్యం ఏమిటి ?

జ).సన్మానాలు సంతృప్తికి మించి పొందానండి.ఆ ఆనందం మాటలలో చెప్పలేనిది‌.అపూర్వమైన ఘట్టాలెన్నో ఆస్వాదించాను.ఇంకేం కావాలి అనే స్థాయికి చేరుకున్నాను.మనిషి ఆశకు అంతం ఉండదు…ఆశయానికి విశ్రాంతి ఉండదు.సినిమాలలో ఇప్పటికే వ్రాసి ఉన్నా విడుదలకు నోచుకోలేదు.కాబట్టి సినిమాలలో పాటలు వ్రాయాలి అనే కోరిక మాత్రం ఉండిపోయింది. ఆ దిశగా సాగడం…ఒక కోణం…దిశ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమాజ చైతన్యం కోసం రచనలు వ్రాయాలానే మరో కోణం అంతర్లీనంగా దాగి ఉంది.మనం ఎన్ని అనుకున్నా ప్రయత్నలోపం లేకుండా పయనించడం అంతా ఈ శ్వరేచ్ఛ అని ముందుకు సాగిపోవడం.!

21.యువత క్రికెట్టు మ్యాచ్,
T. V. షోలపై చూపే మక్కువ
సాహిత్యం పై చూపట్లేదు, దీని
పై మార్పుకు సూచనలిస్తారా?

జ).అవునండీ.యువత క్రికెట్టు మోజులో మిగతా ఆటలు,చదువులు,ముఖ్యమైన పనులు కూడా వీడి క్రికెట్టు ఆడటం చూడటం చర్చించడం ఏదో గొప్పలా ఫీల్ అవుతున్నారు.ఇక టి.వి.లో ఆటలు మరియు సమయం వృధాచేసే షోలు చూస్తూ విలువైన కాలాన్ని చేజార్చుకుంటున్నారు.దానివలన దృష్టి లోపం పెరగడం…తెలియకుండా వత్తిడి ఎక్కువ అవ్వడం ఇది ఖచ్చితంగా అనారోగ్య పరిణామం.ఇక సాహిత్యం పై చూపడం లేదంటే తల్లిదండ్రులే కొంతవరకూ బాధ్యత వహించాలి.వారు ఏవో పుస్తకాలు దైవచింతనలో పూజలు చేస్తూ ఉంటే అవి చూసి పిల్లలు ఇదీ మన జీవన విధానం అని చూసి నేర్చకుంటారు.అంతేకాని పిచ్చి పిచ్చి సీరియల్స్ చూస్తూ అమ్మ సెల్ ఫోనేసుకుని నాన్న కూర్చుంటూ పిల్లలకు మాత్రం ఇలా ఉండాలి అలా ఉండాలి అని నీతులు చెబితే ఎవరు వింటారు.ఇక పిల్లలకు కూడా నీవు చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని,ఒక మంచి పుస్తకం చదివితె ఒక మంచి స్నేహితుడను పొందినట్లుని చెప్పగలగాలి.

22.రాష్ట్ర స్థాయిలో సాహిత్య ప్రచారానికి, కవులను ప్రోత్సహించడానికి ఓ T. V. ఛానల్
ఉంటే బాగుంటుందేమో?

జ).అవసరం లేదండీ.ఉన్న టీ.వి. చానల్స్ లలో
రోజుకి ఒక గంట సాహిత్యం గురించి ఉంటే చాలు.ప్రత్యేక చానల్ అంటే ఎవరు చూడరు.ప్రక్కవారి రచనలు చదివే అలవాటే మన కవులకే తక్కువ. ఎంత సేపు వాళ్ళు వ్రాసిన నాలుగు అక్షరాలు మనకి చెప్పేయాలనే తపన తప్ప నాలుగు మంచి రచనలు చదవాలనే ఆసక్తి తక్కువ.

23.జీవితాన్ని కాచి వడపోసినట్టు, హృదయం ద్రవించేట్టు రచనలు చేసిన అలిశెట్టి
ప్రభాకర్ ను ఆయన అభిమానులు తప్ప అంతా దూరం ఉంచారు. వాస్తవం కాదా?

మెట్టమొదటగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే అర్హత నాకు లేదు.నాకు కూడా చాలా తక్కువ ఆయన గురించి తెలుసు .బహుశా
ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు రావలసినంత పేరు రాలేదనియూ ఒక ప్రాంత వాసిగా బహుశా ముద్రవేసి పెద్దలు అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదేమోనని నా అభిప్రాయం

24.ఏదోరణిలో రచనలు సాగితే ప్రజలకు, దేశానికి ఉపయోగం ఆంటారు…?

జ).రచనలలో అనేక వాదాలు వచ్చేసాయి.ఎవరిది వారే సమర్థించుకోవడం ఇతర వాదాలను విమర్శించడం సరిపోతుంది. ఏది ఏమైనా దేశ సమగ్రత సౌభ్రాతృత్వం పెంపొందే రచనలు మాత్రమే దేశానికి ఉపయోగమని చెప్పగలను.సెక్యూలర్ దేశమంటూ దేశం మీద దాడి చేస్తున్న ఏ స్వదేశీయుడకూ నేను మద్దతు తెలుపను.ఈ గడ్డపై పుట్టి ఈ గడ్డనే విమర్శించేవారిని కవులు అనేకన్నా తీవ్రవాదులు దేశానికి పట్టిన చీడ పురుగులు అని నా వ్యక్తి గత అభిప్రాయం

25.విద్య అన్నది జ్ఞానాన్ని అందిస్తే, సాహిత్యం మానసిక జాడ్యాలను, సామాజిక రుగ్మతలను కొంతైనా తొలగిస్తుందని భావిస్తాను, ఏకీభవిస్తారా?

జ).మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.మంచి సాహిత్యం తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది. మేథావుల రచనలు మాత్రమే ఉపయోగపడతాయి.కొందరు సంకుచిత తత్వంతో మేథావుల ముసుగులో అస్థిరతకు గురిచేసే రచనలు మాత్రం చదువరాదు.అటువంటివి లేని మానసిక జాడ్యాలను,సామాజిక రుగ్మతలను పాఠకుల మీద రుద్దబడతాయి.ఒక వర్గాన్ని కొమ్మకాసే రచనలు,ఒక వర్గాన్ని విమర్శించే రచనలు అసలు చదువరాదు.సంస్కృతి సంప్రదాయాలు,దేశ చరిత్ర,మానసిక వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగ పడేవి,మానసిక ప్రశాంతత,వినోదం,విజ్ఞానంజలిగించేవి అంతర్జాతీయంగా ఖ్యాతి చెందిన రచనలు
చదవడం పాఠకుల ఆలోచనలో సమగ్రమైన మంచి మార్పులు తీసుకు వస్తాయని నా ప్రగాఢ నమ్మకం…!

26.ప్రత్యేకంగా ప్రముఖ కవుల రచనలతో పత్రిక ఒకటి వుంటే మార్పు ఉంటుందంటారా?

జ).ప్రత్యేక వార పత్రికలు మాస పత్రికలు ఉండనే ఉన్నాయి కదా.వాటికి ప్రోత్సాహం ఉండుటలేదు.ఉన్నవాటిని ప్రోత్సాహిస్తే చాలండి.అసలు నేను కవిని అని సన్మానాలు చేయించుకుంటున్న కవులు వారానికి ఒక సాహిత్య పత్రికో కొనగలగుతున్నారా…..కనీసం నెలకు ఒక మాస పత్రిక కొని చదువుతున్నారా…ఆలోచించండి…ఎదుట వారి రచనలు చదవాలి విశ్లేషణ చేయాలి అని ఎవరన్నా అనుకుంటున్నారా….!
ప్రముఖ కవుల రచనలు చదివితే చాలు అని నా అభిప్రాయం

27.ఇప్పటి తరం యువతకి చాలావరకు ఆధ్యాత్మిక రచనలు నచ్చవు నిజమా
కాదా?

జ).అందరినీ ఒకే గాటిన కట్టలేము కాని మీరన్నది సత్యదూరం కాదు.ముందుగా ఇంటి పెద్దలు ఇంట్లో నిత్య పూజలు చేస్తే
దైవత్వం వైపు పిల్లలకు ఆలోచన సాగుతుంది.ఆధ్యాత్మిక కోణంలోని శోభ వారికి కనబడుతుంది. పిండి వంటలు,నైవేద్యాలు సమర్పణ పిదప దొరికే
పలహారాలు కూడా సంప్రదాయ మూలాల వైపు ఆలోచనలు కలుగ జేస్తాయి అనేది నా అభిప్రాయం.మనంఇంట్లో భగవద్గీత, రామాయణం, మహా భారత గ్రంధాలు ఉండటం చదవడం చేస్తే దానిలో దాగిఉన్న ఎన్నో చిన్న చిన్న కథలు జీవితానికి ఉపయోగపడతాయి.పిల్లలను ఆధ్యాత్మిక గ్రంథ పఠనం వైపు ఆసక్తి కలిగేలా చేస్తాయి

28.మీరన్నట్టుగా నిర్మొహమాటంగా, నిజాయతీగా, వర్తమాన పరిస్థితులపై ఎప్పటి
కప్పుడు స్పందించి రచనలు చేస్తేనే, కవి రచనలకు సార్థకత ఔనంటారా…?

జ).తప్పకుండా ఉంటుంది. ఎవరి మెప్పుకోసమో తప్పు అని చెప్పాల్సిన చోట ఒప్పు అని చెప్పే నీచ స్థితిలోకి మాత్రం కవి దిగజారకూడదు.సమాజానికి చేటు కలిగించే దానిని వ్యతిరేకించాలి….విమర్శనాత్మక రచనలు చేయాలి…సరియైన పరిష్కార దిశగా కవుల కవనాలుండాలి.అంతే కాని సమాజాన్ని అస్థిర పరచి ఒక వర్గాన్ని ఆకట్టుకునే కవిత్వం అసాంఘిక శక్తుల చేతిలో అస్త్రం అవుతుంది.గుర్రం జాషువా గారు విశ్వనరుడను నేను అన్నారు.కవి విశ్వానికి సమాధాన కర్త అన్నట్లుండాలి కాని
పదవులకోసమో కాసుల కోసమో ఓట్లకోసమో పలు ప్రలోభాలకు లొంగి,ప్రాంతాలుగా మతాలుగా విభజించే సాహిత్య పయనం ఆత్మహత్యా సదృశం అని చెప్పగలను.కొందరు విచ్ఛిన్న కర శక్తులకు అండగా ఉంటూకవులమంటూ రాస్తారు.అలాంటి దేశద్రోహులను మాత్రం శిక్షపడాల్సిందే….లేదంటే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తారు.దేశాన్ని అస్థిర పరుస్తారు.

29.ప్రచార మాధ్యమాల్లో రోజూ నిర్ణీత సమయంలో రచనలు ప్రచారం చేస్తూ, వాటిపై స్పందనలు, చర్చలు జరుపుతే వేగంగా సాహిత్యం విరాజిల్లుఅవకాశం ఉంటుంది. మీరన్నట్టు నిజమేగా?

జ).అవును.సమయం కేటాయించ గలిగిన వారు ఆసక్తి ఉన్నవారు ఆ శక్తి ఉన్నవారు సాహిత్య పోషకులు ప్రవృత్తిగా కలిగిన వారు
చూసే అవకాశం ఉన్నది.కాని ఇప్పటికే ఒకటి రెండు చానల్స్ లో గరికపాటి గురువుగారు,డా.మీగడ రామలింగ స్వామి వారు తెలుగు….పద్యాలు వినిపిస్తూ వివరిస్తూనే ఉన్నారు.కొందరు మాత్రమే అలాంటి కార్యక్రమాలకి‌ ప్రాధాన్యత ఇస్తున్నారు.తెలుగు భాష మీద మమకారం పెంచుకోవడం ఉత్తమ రచనలు చదవడం పఠనాసక్తి పెంచుకోవడం లాంటి పనులు చేయకపోతే భాషా ప్రభ రాను రాను ఇంకా తగ్గే ప్రమాదం ఉంది.మీడియా కేవలం రాజకీయాలను మాత్రమే ముడిసరుకుగా ఎంచుకోకుండా కొంత భాషా పరిరక్షణకు…పదికాలాలు నిలిచేలా ప్రోత్సించుటకు నడుం కట్టాలి.పది కాలాలు మన తెలుగు సాహిత్య సౌరభాలు వెదజల్లాలి.

30.రచనల్లోపద్యంగొప్పదనఅంతాఒప్పుకునేదే..వాటిలో ఛందస్సు అనుభవం లేని నాలాంటి వాడికి ఏమైనా సులభతరమైనవి ఉన్నాయా?

జ).రచనల్లోన పద్యం గొప్పదా గద్యం గొప్పదా అంటే నేను పద్యం ముట్టలేదు కాబట్టి చెప్పడం సరికాదు.మీరన్నట్టు పద్యమే గొప్పదయితే అది ఛందస్సులో బంధింపబడి ఉంటుంది కదా….ఏదైనా దేని సౌందర్యం పదబంధం దానిదే….రెండు రెండు కనులు లాంటివి.ఇక పద్యాలు ఇంత సులభంగా సరళంగా వ్రాయొచ్చా అనిపించేంతటి గొప్ప పద్యాలు వ్రాసేవారు మనలోనే ఉన్నారు.ఉదాహరణకు పద్యశ్రీ అంజయ్య గౌడ్ గారు….కాబట్టి పట్టు దొరకిన ప్రక్రియలో ముందుకెళ్ళడమే…ఇక వెలిదె ప్రశాద శర్మ గారు,శేష కుమార్ గారు ప్రశంశను కూడా పద్యరూపంలో చెప్పేస్తున్నారు.పద్యాలకు సంబంధించిన ఛందస్సు ఒక చోట విపులంగా వ్రాసుకుని అవగాహనకు వచ్చాక సహజంగా మీలో ఉన్న సాహిత్య విద్వత్తును తోడు జేస్తే పద్యం వ్రాయడం అంత కష్టమేమీ కాదు.

31.కొన్ని పత్రికలు మనకునచ్చిన రచనలు పంపినా ప్రచురించరు. అలా కాకుండా
స్వీకరించే పత్రికలు తెల్పగలరు?

జ).మనం వ్రాసినవి కాబట్టి మనకు నచ్చుతాయి.కాని వాటి వలన పత్రికకు ఎంత ఉపయోగం ఉంటుంది. సర్కులేషన్కి ఏమన్నా ఉపయోగ పడుతుందా.అసలు విషయం ఉన్నదా శిల్పం ఎలా ఉంది అసలు ఎక్కడ మొదలు పెట్టారు ఎక్కడ ముగించారు…..ఇలా ఎన్నో కోణాలలో ఎడిటర్ లేదా సబ్ ఎడిటర్ ఆలోచన జేస్తారు.కావున వారు ప్రచురించ లేదు అనే కన్నా మన రచనలో వాసి ఎంత అనేది ముఖ్యం.ఈ మధ్య ,నేటి నిజం ఇలా ఎన్నో పత్రికలలో కవితలు ప్రచురిస్తున్నారు కొన్ని ప్రముఖ పత్రికలలో కూడా మంచి కవితలు ఇస్తే ప్రచురిస్తారు.

32.వాట్సప్ గ్రూపుల్లో మనరచనలు మనమే చూస్తున్నాం. పత్రిక పేజీలో కొంతభాగం కవులకు కేటాయిస్తే పాఠకులంతా చదివే అవకాశం ఉంటుందని, ఉండీలేనంతగా కొద్ది స్థలమే కేటాయించడంతో కొందరికి నిరుత్సాహంగా ఉంది.దీనిపై మీ స్పందన…?

వాట్సాప్ సమూహంలో మన రచనలు సభ్యులందరూ చదవాలి.మంచివి మిగతా తామున్న సమూహాలకు పంపాలి.ఇలా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉన్నది.సాక్షి,ఆంధ్రజ్యోతి పత్రికలలో వారానికి ఒక రోజు కవితలు ప్రచురిస్తారు.కేటాయించేది చిన్న భాగమే కాబట్టి రోజూ అన్ని పత్రికలు ప్రోత్సాహంతో ప్రచురిస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది.పత్రికలవాళ్ళు కూడా విలక్షణంగా ఆలోచన చేసి ప్రచురిస్తే సాహితీ పిపాసకులకు విందు భోజనంలా ఉంటుంది

33.తొలినాటి సంస్కృత రామాయణ, మహాభారత గ్రంధాల్లాగా స్ఫూర్తినిచ్చే సాంఘిక, సామాజిక గ్రంథాలు వర్తమాన పరిస్థితుల ఆధారంగా ఉన్నాయంటారా…?

జ).ఒక్కటి నిజం క్రొత్తగా అటువంటి గ్రంధాలు రావక్కర్లేదు.ఉన్న మహా గ్రంథాలు చదివితే చాలు. మరో వెయ్యి సంవత్సరాలకు సరిపడా గ్రంథాలు అవి.ఎన్నో నీతి కథలు,మానిసికోల్లాస సూచనలు,ఎలా సమాజాన్ని చూడాలి,ఎలా వ్యక్తులుతో వ్యవహరించాలి,నడచుకోవాలి,పరిపాలించాలి,నియమాలు ఎలా ఉండాలి,సరిగా లేకుంటే ఏమవ్వుతుంది,ఏది ధర్మం,ఏది సత్యం,ఏది నిత్యం…ఇలా ఎన్నో విషయాలు పొందుపరచి మనకోసమే తము కష్టించి వ్రాసిన మహా గ్రంధాలు ఉన్నాయి. అంతెందుకు ఈ మధ్య వచ్చిన అల వైకుంఠ పురం సినిమా ఉదాహరణకు తీసుకుంటేదర్శకుడు బమ్మెర పోతనామాత్యులు వ్రాసిన పద్యంలో మొదటి పాదం తీసుకుని టైటిల్ పెట్టి కథ వ్రాసారు….మరి బమ్మెర పోతన గారు ఏ సంవత్సరానికి చెందిన వారు.బ్లాక్ బస్టర్ గా ప్రదర్శితమవుతున్న ఆ సినిమా బేస్ మన పెద్దల సాహిత్యం…..ఇక ఈ తరంలోనూ ఎన్నో రచనలు వచ్చాయి…వాటిలో పివి నర్శింహరావు గారు వ్రాసిన ఇన్సైడర్ చదవండి.ఎన్ని విషయాలు పొందు పరిచారో తెలుస్తుంది.పుస్తక పఠనమే అన్నిటికి సర్వాధారం.అమ్మ శర్వాణి దీవెనే సదా సర్వావస్థలయందు మనకు ఆత్మస్థైర్యం చేకూర్చుతుంది.

34.అలాంటి ఉధ్గ్రంధాలు రాసే
వారున్నారా?

జ).తక్కువే.అంత సమయం వెచ్చెంచే వారి సంఖ్య బహుతక్కువ.అలా అని స్తబ్దత పొందినదని అనుకోవలసిన అవసరం లేదు.సమయం వచ్చినప్పుడు వ్రాయాల్సిన అవసరం ఉన్నప్పుడు అలాంటి గ్రంధాలు రచించాల్సిన సందర్భంలో ఒక మహారచయిత కనబడతాడు.రచన జనాల్లోకి వెళ్ళాక ప్రజాధరణ పొందితే తప్పక అతని పేరు శాశ్వతంగా ఉంటుంది.ఆ రచన సమాజోద్దోరణకు పనికి వస్తుంది.

35.ఎవరూ స్పందించకున్నా, సాహితీ సంస్థలు తమ తమ కృషిని కొనసాగిస్తూనే ఉన్నైపాఠకుల స్పందనే తక్కువగా ఉంది నిజమేగా?

జ).ఇది క్లిష్టమైన ప్రశ్నే రామ బ్రహ్మం గారు.స్పందన లేదని అనలేం…విపరీతంగా ఉన్నదనీ అనలేం….కొన్ని మాత్రమే నిస్వార్థంగా పని చేస్తున్నాయి.కొందరు తమ ఉనికి కాపాడుకోవడానికి పని జేస్తున్నారు.కొందరు సాహిత్యం యెడల తమకు గల అపారమైన గౌరవాన్ని గుండెలలో దాచుకొని సాహిత్య సేవ చేస్తున్నారు.ఉదాహరణకు మన *మల్లినాథసూరి కళాపీఠం సంస్థ ఆవిర్భావం నుండి అమరకుల గారు నిస్వార్ధంగా ఎనలేని కృషి చేస్తున్నారు.మల్లినాథసూరి అనే ఓ మహోపాధ్యాయుడు కొందరికే పరిమితమై తెరమరుగవుతున్న వేళ ఆ మహా రచయిత జనించిన ఏడుపాయల ప్రాంతం నుండి మొదలుకొని ఆయన సాగించిన సాహిత్య ప్రక్రియ యొక్క అద్బుతమైన ఆవిష్కరణకు పట్టాభిషేకం చేస్తున్నారు.ఆ మహాకవిని వర్ధమాన కవులకు పరిచయం చేసిన ఘనతను అమరకుల గారు సొంతం చేసుకున్నారు.మంచి రచనలు మాత్రమే పుస్తకాలుగా ముద్రణ సాగిస్తే తప్పక అవి పాఠకులను ఆకట్టుకుంటాయి.అంతే కాని ఒక వ్రాసిన ప్రతీ కవిత ముద్రణాయోగ్యమయినదంటే నేను ఒప్పుకోను.

36.కవన క్రతువులు శ్రద్ధగా నిర్వహిస్తూ ఆ అనుభవాలతో అమరకుల గారు గ్రంధస్తం చేయడానికి పూనుకున్నారు, అభినందిద్దామా..

జ).తప్పకఅభినందించాలి.అనుసరించాలి.అవసరమైన పాత్రపోషించాలి…నేను సైతం అంటూ సాహిత్య సహజీవనం సాగించాలి…నలుగురికీ చాటి చెప్పాలి…నిస్వార్థంగా మమేకమై మన వంతు కృషి చేయాలి….పది కాలాలు నిలిచే సాహిత్యాన్వేషణకు పునాదులై నిలబడాలి….ప్రాంతాలకతీతంగా ఇరు తెలుగు రాష్ట్రాల కవులు సహకరించాలి…మంచి రచనలతో కవన కవన షడ్రుచుల విందు పాఠకుడారగించాలి… ఇదే నా ఆకాంక్ష ఆశీర్వచనం….!

37.ఆయన గారి సారధ్యంలో ఎన్నో వింతలు చూడబోతున్నమనం అదృష్టవంతులమే
కదా…?

జ).వింతే కాదు మనసు పులకింత కూడా…రచన నా ఆరో ప్రాణం… ఒక మేనేజర్ గా ఒక సాంకేతిక నిపుణిడిగా నా బాధ్యతలు ఒక ప్రక్క సమయం నన్ను బంధిస్తున్నా నిత్యం ప్రోత్సాహ పరుస్తూ కవికుల తిలకా నీవు వ్రాయకపోతే ఎలా
నీలోని తాత్వికతా భావం పంచకపోతే ఎలా అని అనునిత్యం నాలో నిదురించే కవిని మేల్కొలిపే కవన భాస్కరుడు అమరకుల.
సాహిత్య సంద్ర పయనంలో నావను నడిపే నిత్యకృషీవలుడు.నా ఆత్మబంధువతడు…నిజంగా ఇది అదృష్టమే కదా….!
కనులు తెరచి కదిలేలోపున
నిజం తెలిసి చదివేలోపున
చేజారి చెరిగిపోయె కావ్యం కాలం
కాలం కన్నేసే ఉంటుంది
వయో భారాన్ని నింపేస్తూ ఉంటుంది
ఏ కాలమైనా స్థిర స్థానంలో ఉండాలంటే
మంచి సాహిత్యం మాత్రమే మనల్ని కాలంలో కలసి కనుమరుగవకుండా నిలుపుతుంది….కవిగా చరిత్రలో ఒక పేజీగా మిగిలేటట్లు చేస్తుంది… ఆ దిశగా పయనించే అమరకులకు ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములివ్వాలని ప్రార్ధిస్తున్నాను.సర్వజనా సుఖినో భవంతు

38.మీరిచ్చిన సమాధానాలకు సంతృప్తి చెందాను, దృశ్య కవి గారు కూడా అనుభూతి చెందుతారని భావిస్తున్నాను. మన సమూహ సభ్యులు కూడా స్ఫూర్తిని పొందుతూ, కలిసి
పయనిస్తూ, కలాలు వాడి వాడిగా కదిలిస్తారని ఆశిస్తూ మీ ఆత్మీయ స్పందనకు ధన్య
వాదములు చెబుతూ సర్వదా కృతజ్ఞతలు గదాధర్ గారూ

జ).మీకు కూడా రామబ్రహ్మం గారూ మరియు ఈ అవకాశం ఇచ్చిన అమరకుల గారికి ఓపికగా చదివిన కవులకు,కవయిత్రులకు హృదయ పూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు…ఈ సాహిత్య పయనంలో ఎదురైన ఎందరో కవులు మహానుభావులు కవయిత్రులు అందరూ మనసున్న మంచి కవులే అందరికీ వందనములు. మనమందరమూ భగవత్ బంధవులము….మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సాహిత్య కుటుంబ సభ్యులం.సంస్థ అభివృద్ధికి కృషి చేద్దాం…సాహిత్య వినీలాకాశంలో మన సాహితీ పతాకాన్నెఝగ రేద్దాం….మన దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం…..

💥🚩భారత్ మాతాకీ జై

జయహో మాతా ఏడుపాయల వనదుర్గా

జైజయహో కోలాచల మల్లినాథసూరి

అమరకుల దృశ్యకవి
&
గీతా శైలజ

మల్లినాథసూరి కళాపీఠం విశిష్ట కవుల సంపాదక వర్గం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *