పసుపు తింటే సరిపోతుందని, మిరియాలు నమిలితే సరిపోతుంది, గోమూత్రం చల్లుకుంటే కరోనా రాదు అంటూ వాట్సప్ లలో అశాస్త్రీయ పద్ధతులు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో కరోనా గురించి చిట్కా వైద్యాలు ఎన్నో వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పసుపు తింటే సరిపోతుందని, మిరియాలు నమిలితే సరిపోతుంది, గోమూత్రం చల్లుకుంటే కరోనా రాదు అంటూ వాట్సప్ లలో అశాస్త్రీయ పద్ధతులు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకుందాం.
నీళ్లు తాగితే కరోనా రాదు ఇది పూర్తిగా అబద్ధం : ప్రతి 15 నిమిషాలకోసారి నీళ్లు తాగితే కరోనా రాదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వస్తున్నాయి. నీళ్లు తాగితే వైరస్ అడ్డుకోవచ్చు అనడంతో ఎలాంటి శాస్త్రీయత లేదని వైద్యులు చెబుతున్నారు.
పసుపు తింటే తగ్గిపోతుంది అనేది అబద్ధం: పసుపు నీళ్లలో కలుపుకొని తాగితే కరోనా వైరస్‌ను నియంత్రిస్తుంది అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పసుపు వైరస్ వ్యాప్తిని అరికడుతుంది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా నిరాధారం.
మాస్కులతో వైరస్ రాదు.. ఎంత వరకూ వాస్తవమో చూద్దాం: మాస్కులు వైరస్‌ను నిరోధించలేవు. అయితే కరోనా సోకిన వ్యక్తి తుమ్ములు, దగ్గుల ద్వారా ఇతరులకు వ్యాపింపచేయకుండా మాస్కులు ఉపయోగపడతాయి. కరోనా సోకిన వారు ఎన్–95 లాంటి నాణ్యమైన మాస్కులను ధరించడం వల్ల ఉపయోగం ఉంది. అంతేకానీ ఆరోగ్య వంతులు ధరించి లాభం లేదు.
ఉప్పు నీళ్లు పులకరిస్తే కరోనా రాదు పూర్తిగా అబద్ధం: ఉప్పు నీళ్లు వైరస్‌లను నియంత్రించలేవు. అలాగే ఆల్కహాల్ లాంటివి పుక్కిలిస్తే కరోనా రాదు అనడంలో కూడా ఎలాంటి శాస్త్రియత లేదు.
ఉష్ణోగ్రత పెరిగితే కరోనా చనిపోతుంది పూర్తిగా అబద్ధం: అతి చల్లని, అతి వేడి వాతావరణం కూడా వైరస్‌ను చంపేస్తుందనడం కూడా శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. శీతల ప్రదేశమైన యూకేలోనూ, అత్యంత వేడి ఉండే దుబాయి, గల్ఫ్ దేశాలు, సింగపూర్ లోనూ కరోనా వ్యాపిస్తోంది.
వెండిపూత తింటే వైరస్ రాదు…పూర్తిగా అబద్ధం: వెండిపూతను తింటే 12 గంటల్లో వైరస్ చనిపోతుందని, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనడంలో శాస్త్రీయత లేదు. అలా చేస్తే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది.
కరోనా ప్రమాదకారి కాదు పూర్తి అబద్ధం: కరోనా వైరస్ సాధారణ ఫ్లూ వైరస్‌ల కన్నా పదిరెట్లు ప్రమాదకరం.
మరికొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది: ఇది కూడా అబద్ధమే కరోనాపై ఇంకా వ్యాక్సిన క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉంది. మరో ఏడాది దాకా పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
పదిసెకన్ల పాటు ఊపిరి బిగబడితే కరోనా ప్రమాదం లేనట్టే: పూర్తిగా అవాస్తవం. కరోనాకు ఊపిరి బిగపట్టడానికి సంబంధం లేదు.
గోమూత్రం సేవిస్తే కరోనా తగ్గుతుంది: ఇది పూర్తిగా అవాస్తవం..ఎక్కడా శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. గో మూత్రం సానిటైజర్ లా పనిచేస్తుందనేది కూడా అభూత కల్పనే. కరోనా వైరస్ కు డిటర్జెంట్, ఆల్కహాల్ బేస్డ్ సానిటైజర్స్ మాత్రమే నాశనం చేయగలదు.
వాట్సప్, ఫేస్ బుక్ ద్వారా వ్యాప్తిలోకి వచ్చి ఈ మెసేజుల్లో శాస్త్రీయత తక్కువగా ఉంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్, లేదా రాష్ట్ర, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న మార్గదర్శకాలనే ఫాలో అవ్వండి. సెల్ఫ్ క్వారంటైన్ ను మించిన మందు కరోనాకు లేదు. కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేసినా, ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేసినా చట్టపరంగా శిక్షార్హం.