మల్లినాథసూరి కళాపీఠం ఏడుపాయల సంస్థాన విశిష్ట కవుల పరిపృచ్ఛ
లో భాగంగా సుస్వర ఝరీప్రవాహం అయిన స్వరకోకిల గౌరవనీయులు బల్లూరి ఉమాదేవి గారిని మేం ఈ వారం పరిచయం చేస్తున్నాం .. చదవండి పద్యం రాయడం ఆలపించడం ఆవిడ అమోఘమైన కళ
-అమరకుల దృశ్యకవి
(కార్యక్రమ సంధానం)
-మంచాల శ్రీ లక్ష్మీ
(పరిపృచ్ఛ నిర్వహణ)
-గీతా శైలజ
ఎడిటింగ్ విభాగండా.బల్లూరి ఉమాదేవి గారితో మంచాల శ్రీలక్ష్మీ.
- శ్రీలక్ష్మీ : నమస్తే అoడి అమ్మా ! “నా సాహితీ సవ్వడి “వాట్సాప్ గ్రూప్ లో ఫిబ్రవరి.4 న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.మహోన్నతమైన ఈ అమ్మ గురించి, మీకు జన్మ నిచ్చిన అమ్మ గురించి ఓం ప్రథమంగా పద్యరూపంలో మన మల్లినాధ సూరి కళాపీఠం కోసం.
డా.బి. ఉమాదేవి: నమస్తే అండి. ముందుగా ఇంత చక్కని అవకాశం కల్పించిన మల్లినాథ సూరి కళా పీఠం అమరకుల దృశ్యకవి చక్రవర్తి వారికి నమస్సుమాంజలులు
మీ మొదటి ప్రశ్న మహత్తరమైన ప్రశ్న. నవమాసాలు మోసికనీ పెంచే కనిపించే దైవాన్ని గురించి అడగడం చాలా ఆనందాన్ని కలిగించింది. అమ్మ ను గూర్చి
[ డా.బల్లూరి ఉమాదేవి గారితో మంచాల శ్రీలక్ష్మీ.
- శ్రీలక్ష్మీ : నమస్తేoడి అమ్మా ! “నా సాహితీ సవ్వడి “వాట్సాప్ గ్రూప్ లో ఫిబ్రవరి.4 న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.మహోన్నతమైన ఈ అమ్మ గురించి, మీకు జన్మ నిచ్చిన అమ్మ గురించి ఓం ప్రదంగా పద్యరూపంలో మన మల్లినాధ సూరి కళాపీఠం కోసం.
డా.బి. ఉమాదేవి: నమస్తే అండి. ముందుగా ఇంత చక్కని అవకాశం కల్పించిన మల్లినాథ సూరి కళా పీఠం వారికి నమస్సుమాంజలులు
మీ మొదటి ప్రశ్న మహత్తరమైన ప్రశ్న. నవమాసాలు మోసికనీ పెంచే కనిపించే దైవాన్ని గురించి అడగడం చాలా ఆనందాన్ని కలిగించింది. అమ్మ ను గూర్చి
ఆ.వె:విశ్వమందు తాను వేదన భరియించి
జన్మ మొసగు నట్టి జనని యెపుడు
దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా
దైవతములకెల్ల దైవమామె.
ఆ.వె:అమ్మ దీవెనుండ నందరానిదనెడు
మాట యుండబోదు మానవులకు
నాపదెపుడు కలుగ దమ్మను దలచిన
నమ్మ దయయె చాలు నవని యందు
- శ్రీలక్ష్మీ : మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి తెలియజేయండి.
ఉమాదేవి :శ్రీ బల్లూరి గోపాలరావు శ్రీమతి రాధమ్మ దంపతులకు 1954లో కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో జన్మించాను.బాల్యము, విద్యాభ్యాసం అనంతపురం జిల్లా కణేకల్లు మరియు కల్యాణదుర్గం లలో జరిగిందండి.ఇంటర్మీడియట్ ముగిసినంతనే కామవరం గ్రామమునకు చెందిన శ్రీ కరణం భీమసేనరావుగారితో ( రైల్వే ఉద్యోగి) వివాహం జరిగింది.అనంతరం శ్రీవారి ప్రోత్సాహంతో ప్రైవేటుగా చదివి డిగ్రీ పూర్తి చేసుకొన్నాను.(1976)అప్పటికే ఇద్దరు పిల్లలు జన్మించడం తో ప్రైవేటుగా ఎం ,ఏ కట్టినా పరీక్షలు వ్రాయలేకపోయాను.నాలోని ఆసక్తిని గమనించి మా శ్రీవారు అనంతపురం లో సత్యసాయి కళాశాలలో చేర్పించి ఎం,ఏ చదివించారు.శ్రీవారి మరణానంతరం నా 52 వ ఏటతెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీలపాటలు-తులనాత్మక పరిశీలన అనే అంశం పై పరిశోధన చేసి పి హెచ్ డి.(P.hd)పట్టా పుచ్చుకొన్నాను..
- శ్రీలక్ష్మీ : సాహిత్యం వైపు పడిన మీ తొలి అడుగులు ఎప్పుడు? మిమ్మల్ని ప్రోత్సహించిన వారెవరు.?
బి.ఉమాదేవి:కళాశాల రోజుల్లోనే మొదలైంది.అప్పుడప్పుడు స్నేహితులు పుట్టిన రోజులకు కవితలు వ్రాసేదాన్ని.వారు ప్రోత్సహించేవారు.మానాన్నగారు మొదటి ప్రోత్సాహకులు.తరువాత శ్రీవారు శ్రీ కామవరం భీమసేనరావుగారు,ఇప్పుడు కుమారులు మరియు కుటుంబ సభ్యులు.
- శ్రీలక్ష్మీ : మీకు పద్యాలే ఎక్కువగా వ్రాయాలని ఎందుకు అనిపించింది.?
బి.ఉమాదేవి: వచనంలో కంటే పద్యంలో అయితే చెప్పదలచుకున్న భావాన్ని స్పష్టంగా చెప్పవచ్చు అనిపించింది. వేమన సుమతి మొదలైన శతక పద్యాలు నన్ను విశేషంగా ఆకట్టుకునేవి. అందులోనూ ఆటవెలదులు అంటే మక్కువ ఎక్కువ నేను రాసిన 10,000 పై చిలుకు పద్యాలలో ఆటవెలదిలో ఎక్కువగా ఉన్నాయి.
- శ్రీలక్ష్మీ : మీ వృత్తి, ప్రవృత్తి గురించి తెలియ జేయండి.
బి.ఉమాదేవి: కర్నూలు జిల్లా ఆదోనిలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా శాఖాధిపతిగా 26 సంవత్సరాలు పని చేశాను.. మాది పండిత కుటుంబం కావడంవల్ల చిన్ననాటి నుంచే సాహిత్యం అంటే ఎక్కువ ఇష్టం. మా తాతగారు బల్లూరు కృష్టప్ప గారు తెలుగు పండితులు. మా నాన్నగారు బల్లూరు గోపాలరావు గారు ,మా పెదనాన్న లు మేనత్త కూడా తెలుగు పండితులుగా ఉండడంవల్ల వారి ప్రభావం కూడా వుంది. కవితలు వ్యాసాలు రేడియో ప్రసంగాల కోసం వ్రాసుకోవడం అలవాటుగా మారింది.పదవీ విరమణ అనంతరం రచనా వ్యాసంగం వ్యసనంగా మారింది.ఆసమయంలోనే సాంకేతిక మాధ్యమం సాయంతో అంతర్జాలంలో వివిధ సమూహాల్లో సమస్యలు పూరించడం అలవాటయింది.ముఖ్యంగా శంకరాభరణం, తెలుగు కవిత్వం సమస్యా పూరణం,పద్యాల సవ్వడి ,పదచయపరిమళం,రసధుని, ప్రజా పద్యం,మొదలైన సమూహాలు చక్కని వేదికలు కల్పించాయి.రోజుకు 6పద్యాల వరకూ వ్రాస్తున్నాను.
- శ్రీలక్ష్మీ : ఒక స్ర్తీగా ,ఒక ఉపన్యాకురాలిగా, అధ్యాపకురాలిగా,ఒక కవి గా మీ కుటుంబాన్ని సమర్థవంతంగా విజయ పథం వైపు ఎలా నడిపించ గలిగారు.?
బి.ఉమాదేవి:వంటింట్లో ఒకే సమయంలో అన్నీ పనులు చేయడం ఆడవాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అని నా అభిప్రాయం.భార్యగా,తల్లిగా ఇంటి పనులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేదాన్ని.తరువాత విద్యార్థులకవసరమైన సమాచారం సేకరించి బోధించేదాన్ని.ఒక కవిగా మానసిక ఆనందం పొందడం నిత్యకృత్య మైంది.
7..శ్రీలక్ష్మీ : ఈ కవి సమ్మేళనానికి “నా ఏఘబాధ్యతల వలన వెళ్లలేక పోయానే “అని ఎప్పుడైనా అనిపించిందా?
బి ఉమాదేవి:అన్ని సమావేశాలకు వెళ్ళలేము గదండి.అప్పుడు. వెళ్ళలేకపోయినందుకు బాధగా అనిపించేది.(అనారోగ్యకారణాల వల్ల,దూరప్రాంతాల్లో వున్నపుడు)
8.. శ్రీలక్ష్మీ : మీకు మల్లినాధ సూరి కళాపీఠం అమరకుల దృశ్యకవి వారితో పరిచయం ఎలా ఏర్పడింది ?
బి. ఉమాదేవి:మేక రవీంద్రగారి సహస్ర కవితా యజ్నం ద్వారా పరిచయం కలిగింది.ముఖాముఖి పరిచయం హైదరాబాద్ లో బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో వారిజాతీయ పురస్కారం అందుకొనే సభలో కలిగింది
9.శ్రీలక్ష్మీ : మల్లినాధ సూరి కళాపీఠం నిర్వహణ ఎలా ఉంది.? ఏమైనా మార్పులు చేస్తే ఇంకా మెరుగు పరచవచ్చా.?
బి ఉమాదేవి:నిర్వహణ బాగుందండి.ఏమార్పులు అవసరం లేదు.కాకపోతే స్పందనలు తెలిపే సమయం పెంచితే బాగుండేదనుకుంటా
- శ్రీలక్ష్మీ : తెలుగు కవివరా ద్వారా ఎందరో కొత్త కవులు కలాన్ని చేత బట్టారు కదా. వారికి మీరు ఏమైనా సందేశం ఇస్తారా.
బి ఉమాదేవి:సందేశమిచ్చేంత గొప్పదాన్ని కాకపోయినా చిన్న సలహా.మనం వ్రాసి పోస్ట్ చేయడమే కాకుండా ఇతర కవుల రచనలు కూడా చదవాలి.అప్ఫుడే మేధస్సు వికసిస్తుంది నా అభిప్రాయం.
- శ్రీలక్ష్మీ : ఒక్క కవిత వ్రాసి సన్మానం చేయించుకునే కవులకు మీరిచ్చే సందేశం ఏమిటి.
బి ఉమాదేవి:సన్మానాలు బాధ్యతను పెంచే దిశలో వుంటే మంచి కవితలు వెలుగు చూస్తాయి.మనకు గుర్తింపు నిస్తాయి.
కాని అవి అహాన్ని పెంచితే కూపస్థమండూకాలవుతాం.
12..శ్రీలక్ష్మీ : ఎటువంటి పుస్తకాలు చదివితే కొత్త కవులు ఇంకా మెరుగు పరుచుకోవచ్చు .తెలియజేయండి.
బి ఉమాదేవి:పూర్వకవులు రచనలు చదవాలి.అందులోని భావాన్ని అవగతం చేసుకోవాలి.పుస్తకాలు మంచి స్నేహితులు అనేది బలంగా నమ్ముతాను.
13.శ్రీలక్ష్మీ: మీరు ఇంతవరకు ఎన్ని పద్యాలు వ్రాసారు. ఎన్ని కవితలు వ్రాసారు.
బి ఉమాదేవి: 10000కు పైగా పద్యాలు వివిధ ఛందస్సులలో రచించాను.శ్రీరామదూత శతకం,అక్షరం వనం అనే పుస్తకాలు ముద్రించ బడ్డాయి.మనోగీతికలు,హిమపవనాలు,ఖండకావ్య సమాహారం అనే పుస్తకాలు ముద్రణకు సిద్ధంగావున్నాయి.
ఇవి కాక ఐదు ఆశ్వాసాలతో “ఆసరా”అనే పద్య ప్రబంధం రచించాను. .అనంతఛందం సమూహంలో వాల్మీకి రామాయణంలో అన్ని కాండములు లోని ఒక్కొక్క సర్గకు తేటగీతి ఛందస్సు లో పద్యాలు రచించాను.
అలాగే చివుకుల శ్రీలక్ష్మి నేతృత్వంలో 16 మంది కవులు రచించిన రామచంద్ర ప్రశస్తి లో “పిబరే రామరసం”అని నావ్యాసం కూడా చోటు చేసుకుంది.అలాగే 116 మంది కవులచే రచింపబడిన “ఆదినుండి అనంతం దాక’ అనే భారతదేశం చరిత్ర వచనకవితా సంపుటిలో “సిపాయిల తిరుగుబాటు’అనే అంశంపై వ్రాసిన కవితకు స్థానం లభించింది.ఇంకా చాలా పుస్తకాలలో నా కవితలు,పద్యాలు చోటు చేసుకొన్నాయి..
- శ్రీలక్ష్మీ : మీకు డాక్టరేట్ వచ్చిన సందర్భం ఏమిటి ?మీరు ఎలా ఫీలయ్యారు.?
బి ఉమాదేవి: నా 51 వ ఏట నేను రచించిన “తెలుగు కన్నడ సంప్రదాయపు స్త్రీలపాటలు-తులనాత్మక పరిశీలన”అనే సిద్ధాంతం వ్యాసమునకు శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా లభించింది.నాటి గవర్నర్ శ్రీ రామేశ్వర్ ఠాకూర్ చేతులమీదుగా అందుకోవడం జరిగింది.
సాధారణంగా అందరూ తమ పిల్లల కాన్వొ కేషన్ కు వెళతారు. కానీ నేను పి హెచ్ డి పట్టా తీసుకునే ముందు నా కుమారులు కోడలు మనవరాలు రావడం మరిచిపోలేని సంఘటనలు… - శ్రీలక్ష్మీ: తెలుగు కవులలో మీకు బాగా ఇష్టమైన కవి ఎవరు ? వారి గురించి… వీలైతే పద్యం లేదంటే మినీ కవిత
బి ఉమాదేవి: ప్రాచీన కవులలో నచ్చినవి సహజ పాండిత్యం బిరుదాంకితుడైన బమ్మెర పోతన.భాగవతం ,భాగవతం అని పదిసార్లు అంటే చాలు మనం బాగవుతాం అనేది ఆర్యోక్తి.అట్టి భాగవతాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో వ్రాసిన కవి పోతన అన్నా,వారి భాగవతమన్నా చాలా యిష్టం.
పోతనమహాకవిని గురించి వ్రాసిన పద్యములు.
పోతన:
1
కం: ఇరవొంది రెండు భాషల
గరిమ గలిగి నట్టి గొప్ప ఘనుడీ కవియున్
హరినారాయణు చరితము
సరళముగా వ్రాసె తాను సకలురు మెచ్చన్.
2
కం:బమ్మెర పోతన వ్రాసెను
నిమ్ముగ శ్రీభాగవతము నిలలో నెపుడో
కమ్మని యా కృతి కడుభ
వ్యమ్ముగ సతతమలరారు భరతావనిలో
3
ఆ.వె:రామభద్రుకితడు రహితోడ నంకిత
మొసగె తాను కృతిని యుర్వి యందు
మోక్ష మార్గ మంద ముదమున దీనిని
చదువుచుందు రెపుడు సజ్జనాళి
4
ఆ.వె:హాలికుండు తాను హలముతో బాటుగా
కలము చేత బట్టి కావ్య మల్లె
నరులకొసగనంచు నారాయణున కంకి
తమ్ము చేసి తాను ధన్యుడయ్యె.
*5ఆ.వె:పలుకు వాడు హరియు పలికించె హరికథ
లనుచు వ్రాసె తాను నవనియందు
భాగవతము నదియు పారాయణముచేయు
తెలుగు వారికెల్ల దివ్వె యయ్యె.
6
కం:వెన్నుని కథలను పోతన
విన్నాణముతోడ వ్రాసి వెలుగులు పంచన్
మన్నన తోడను చదివిన
బన్నంబులుబాయు ననుచు పఠియింతు రిలన్.
7
ఆ.వె:¡భాగవతపు మహిమ బ్రహ్మయు నెరుగడు
శివము లొసగు నట్టి శివుడు నెరుగ
డనుచు తెలుసు కొనిన యంత తేటపరతు
ననుచు వ్రాసె కావ్య మాంధ్రమందు.
8
ఆ.వె:శ్రవణ మాదియైన చక్కని భక్తుల
నుర్వి యందు తాను నుదహరించ
జనుల యందు భక్తి సహజముగాకల్గె
మార్గదర్శి యగుచు మాన్యుడయ్యె.
.ఇంత చక్కని అవకాశమిచ్చి నన్ను పరిచయం చేసినందుకు నిర్వాహకులు శ్రీ అమరకుల దృశ్యకవి అధ్యక్షుడు కోలాచల మల్లినాథసూరి కళాపీఠం-ఏడుపాయల గారికి,చక్కని ప్రశ్నలతో పరిపృచ్ఛ చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.