Chathrapathi ShivajiChathrapathi Shivaji

హైందవ దేశాన్ని ముష్కర రాజులు కబళిస్తున్న వేళ హిందూ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన ధీరుడు, చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి ఈరోజు.

అన్యమతస్తులు చాపకింద నీరులా హైందవ మతాన్ని కబలిస్తున్న ఈ వేళ మనందరం హైందవ ధర్మ పరిరక్షణకు అభినవ శివాజీ లా నడుం కట్టాలని ఆకాంక్షిస్తూ మనసారా ఆ మహాత్ముని స్మరించుకుందాం.

ఆ హైందవ ధర్మ వీర చక్రవర్తి చరిత్ర మీ కోసం…

స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, మధ్యయుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. అలాగని ఆయన హిందూ మత దురాభిమాని కూడా కాదు. ఇతర మతాలను గౌరవించి, ఆదరించాడు. నిజాంషాహీల ప్రతినిధి అయిన శివాజీ తండ్రి శహాజీ మొఘలులకు వ్యతిరేకంగా అనేకసార్లు పోరాటం చేశారు. అయితే తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా వీరుణ్ని నిజాం నవాబు హత్య చేయించడంతో వారితో వైరాన్ని పెంచుకుని, తిరుగుబావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఈ కాలంలో శివనేర్ కోటలో శివాజీకి జిజాబాయి జన్మనిచ్చింది. ఫిబ్రవరి 19, 1627 వైశాఖ శుక్ల తదియనాడు పుట్టిన కుమారుడికి తాను ఆరాధించే శివై (పార్వతి) పేరు కలిసొచ్చేలా శివాజీ అని నామకరణం చేసింది.

తల్లి సంరక్షణ, దాదాజీ ఖాండ్‌దేవ్ శిక్షణతో శివాజీ వీరుడిగా అవతరించారు. భారతరామాయణాల విశిష్టత, హిందూ మతం గొప్పదనం తల్లిద్వారా నేర్చుకున్నాడు. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం కూడా ఆమె ద్వారా పెంపొందించుకున్నాడు. తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో యుద్ధ తంత్రంలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యా పారంగతుడైన శివాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా వ్యూహారచన చేశాడు. 17వ ఏటనే తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న శివాజీ, బిజపూర్ సుల్తానులకు చెందిన తోర్నా కోటను ఆక్రమించుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్‌ఘడ్ కోటలతో సహా పుణే ప్రాంతాన్నంతా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.

శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ రీతులు తెలుసుకొన్న అఫ్జల్‌ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని భావించాడు. శివాజీని రెచ్చగొట్టడానికి ఆయన ఇష్ట దైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్‌ఖాన్ దుర్బుద్ధి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి వెళ్లాడు. ఇద్దరూ తమ అంగరక్షకుల సమక్షంలో చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ కత్తితో శివాజీపై దాడి చేశాడు. ఉక్కుకవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అడ్డువచ్చిన అఫ్జల్‌ఖాన్ అనుచరులను శివాజీ సైనికులు అడ్డుకున్నారు. దీంతో శివాజీ తన దగ్గరన్న పులి గోర్లతో అఫ్జల్‌ఖాన్ పొట్టను చీల్చి హతమార్చాడు.

యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు కాకుండా ప్రజాక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘంగా యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. ఓడిపోయిన శత్రురాజ్యంలో నిస్సహాయులు, మహిళలు, పసివారికి సహాయం చేశాడు.

శివాజీ సైనికాధికారి ఓ ముస్లిం రాజును ఓడించి అతడి కోడలిని బంధించి తీసుకొచ్చాడు. మహిళను బంధిచడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివాజీ.. నా తల్లి కూడా మీ అంత అందమైంది అయితే నేను కూడా అందంగా ఉండేవాడిని అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో రాజ్యానికి తిరిగి పంపాడు. శివాజీ అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించాడు. ముస్లింల రాజ్యాలపై అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ తన రాజ్యంలోని ముస్లింల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి.

భారతావనిలో చాలా మంది రాజులు పరిపాలించినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేశాయి. శివాజీ దేవి భక్తుడు. తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా గౌరవించాడు. కేవలం ఆలయాలే కాదు మసీదులను సైతం కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములే. వారిని కూడా ఉన్నత పదవుల్లో నియమించాడు.

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *