మల్లినాధసూరి కళాపీఠం ఏడుపాయల సంస్ధాన
విశిష్ట కవుల పరిపృచ్ఛ
లో భాగంగా అవేరా గారి మది వివిధ ప్రక్రియ ల అంబుధి.పైకి ప్రశాంతంగా కనిపించినా అంతరంగాన ఎగసిపడే వైవిధ్య మైన రచనా
తరంగపు సునామీలు మనమిప్పుడు చదివి తెలుసుకుందాము.
అమరకుల దృశ్య కవిచక్రవర్తి
(కార్యక్రమ సంధానకర్త)
కె.గీతాశైలజ
(పరిపృచ్ఛ నిర్వహణ
ఎడిటింగ్ విభాగము)
అవేరా గారితో ముఖాముఖీ
విభాగము-1
1).అందరూ మిమ్మల్ని అవేరా అనే పిలుస్తారు
మీ పూర్తి పేరు తెలియచేస్తారా?
జ):అవునమ్మా సాహితీ మిత్రులందరికీ నేను ‘అవేరా’గానే తెలుసు. నా పేరు అనుసూరి వేంకటేశ్వర రావు లోని మొదటి మద్య చివరి అక్షరాలు కలిపి ‘అవేరా’ నే నా కలం పేరుగా పెట్టుకున్నాను.
2).సర్ మీ వ్యక్తిగత వివరాలు మీ ఉద్యోగం
వ్యాసంగముల గురించి తెలియచేస్తారా?
తప్పకుండానమ్మా?
జ).నా పూర్తిపేరు అనుసూరి వేంకటేశ్వరరావు(అవేరా).
కలం పేరు:అవేరా (పేరు మూడు భాగాల్లోని మొదటి అక్షరాలు)
భార్య సూర్యవరలక్ష్మి, సంతానం ఇద్దరు పాపలు ఒక బాబు.
పెద్ద అమ్మాయి బి.టెక్(USలో వుంది) చిన్నమ్మాయి బిఆర్క్(ఆర్కిటెక్చర్) పూర్తి చేసారు అమ్మాయిలిద్దరి పెళ్ళిల్లు, బాబు చదువు(బీఆర్క్) పూర్తైపోయాయి.
అమ్మనాన్నల పేర్లు సూర్యాకాంతం, వేంకట రావు
నా జన్మస్థలం ఖమ్మం. నాన్న గారు పోలీస్ డిపార్ట్ మెంటులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(DSP)గా రిటైర్ అయ్యారు.
నా ప్రాథమిక విద్య పోలీస్ లైన్స్ ప్రాథమికోన్నత పాఠశాల నల్గొండలో, 6th(సగం),7వ తరగతి ZPHS చౌటుప్పల్ (నల్గొండజిల్లా)లో, 8 నుండి బి.టెక్ వరకూ హైదరాబాదులో చదువుకున్నాను నేను హైదరాబాద్ లో బి .టెక్,(సివిల్), జె ఎన్ టి యు కాలేజి లో పూర్తిచేసాను. అప్పటిలో రాష్ట్రం మొత్తం మీద 6 ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే వుండేవి.
కాలేజీలో మంచి మిత్రుల సహచర్యం మరచిపోలేని మధురజ్ఞాపకం.అప్పుడు కాలేజీలో నా సహచర మిత్రుడు మేక రవీంద్ర.
కాలేజీలో మరొక మధుర జ్ఞాపకం నేను చదరంగంలో
కాలేజ్ టీమ్ కి సెలక్ట్ కావటం, తరువాత యూనివర్సిటీ టీంకి సెలక్ట్ కావటం,నేషనల్ లెవల్ లో ఇంటర్ యూనివర్సిటీ చెస్ పోటీల్లో మంగళూరులో జెఎన్. టి.యూ
యూనివర్సిటీ తరపున పాల్గొని కొన్ని ఆటలలో గెలవటం.
బీ.టెక్ పూర్తి చేసాక శంకరపల్లి కందిలో MES క్వార్టర్స్ నిర్మాణంలో, నేటి తాజ్ కృష్ణా పునాదుల పనుల్లో, బోట్ (BOTE)అనే ఒక టెక్నకల్ కన్సల్టెంట్ దగ్గర పనిచేసాను.
ఆ తరువాత APPSC నోటిఫికేషన్ ద్వారా Asst Hydralogist (రాష్ట్రం మొత్తం మీద 13 పోస్టులు)పోటీ పరీక్షలు వ్రాసి తరువాత ఇంటర్యూ ద్వారా మొదటి ప్రభుత్వ
ఉద్యోగం భూగర్భజలశాఖలో సంపాదించాను.
ఆ తరువాత A.E.E ఉద్యోగాల కొరకు APPSC నోటిఫికేషన్ వస్తే దరకాస్తు చేసుకొని పోటీపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్
అయ్యి మొదటి ఉద్యోగానికి (10నెలల సర్వీస్)రాజీనామా చేసి నీటిపారుదలశాఖలో అసిస్టంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరుగా చేరి పదోన్నతులు పొందుతూ సూపరింటెండింగ్ ఇంజనీరు గా ఇటీవల రిటైర్ అయ్యాను.
ప్రస్తుతము సుప్రీంకోర్టు అనుబంధంగా వున్న –ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్ నేటివ్ డిస్ప్యూట్ రెసొల్యూషన్ లో ఆర్బిట్రేటర్ (జడ్జ్ లాగా) గా త్వరలోనే జాయిన్ కాబోతున్నాను.ప్రస్తుతం ట్రైనింగ్ లో వున్నాను.
వ్యాసంగములు:
క్రికెట్ ఆడటము, చదరంగం,కారమ్స్,షటిల్ ,సాహిత్య పఠనము,రచనలు.గతం లో కార్టూన్లు కూడా వేసేవాడిని.
ప్రస్తుత నివాసము బోడుప్పల్(గ్రా), ఘటకేసర్(మం),మేడ్చల్ జిల్లా ఫోన్ నెం. / చరవాణి సంఖ్య:7207289424
స్వంత you tube channel: avera videos
3).మాస్టారు మీరు రచనలను ఎప్పటినుండి చేస్తున్నారు?
జ): నా మొదటి కవిత నా 16వ ఏట ఇంటర్మీడియట్ లో వ్రాసి గురువుగారు ఆచార్య తిరుమల గారి ఆధ్వర్యంలో రేడియోలో యువవాణి కార్యక్రమంలో చదివాను.
తరువాత ఆంధ్రభూమి వారపత్రికలో చాలా సార్లు కవర్ పేజీకామెంట్ లకు బహుమతి పొందాను. అప్పుడప్పుడు కవితలు వ్రాసుకునే వాడిని.
తరువాత మిత్రుడు మేక రవీంద్ర ఏర్పాటు చేసిన సహస్రకవుల సమూహంలో చేరాక (అక్టోబరు 2016) పూర్తి
స్థాయిలో వ్రాయటం మొదలు పెట్టాను. ఈ మూడున్నర
సంవత్సరాలలో పన్నెండు ప్రక్రియలలో సాహితీ సేద్యం చేసాను.కవన కర్షకుడిగా దాదాపు 2000 కవితలూ 500పైగా పద్యాలు వ్రాసాను.వివరాలు ముందుముందు చెబుతాను.
4).మీరు రచనావ్యాసంగములోనికి రావటానికి
ప్రేరేపించిన కారణాలేమిటి?
జ).:మా JNTUకాలేజీ వాట్సప్ గ్రూపులో మేక రవీంద్ర గారు ఎవరైనా సాహిత్యం పట్ల శ్రద్ద వుండి వ్రాసే వాళ్ళుంటే
చెప్పండి నేను నిర్వహించే సహస్రకవుల వాట్సప్ గ్రూపులో
చేర్చుకుంటానన్నారు. ఆ సమయంలో నేను యల్లంపల్లీ ప్రాజెక్ట్ డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీరుగా వుండటం
ఫీల్డ్ వర్క్ లేకుండా ఆఫీస్ వర్క్ మాత్రమే వుండటంతో
ఖాళీ సమయంలో కవితా సాహిత్యం చదువవచ్చని ఆలోచించి, నేను వ్రాయలేను గాని చదివే ఆసక్తి వుంది నన్ను చేర్చుకోమంటే SK సంఖ్య 101 తో నన్ను సహస్రకవుల గ్రూపులో చేర్చటం జరిగింది.
తరువాత ఆ గ్రూపులో వచ్చే కవితలను చూస్తూ తోటి కవుల
ప్రోత్సాహక స్పందనలు చూస్తూ, నాకు కూడా కవితలు వ్రాయాలనే కోరిక కలిగింది. అప్పుడు తొలినాళ్ళలో నేను సమకాలీన సామాజిక(వార్తాపత్రికలవార్తలు) అంశాల ఆధారంగా వ్రాసిన కవితలను MVL గారు, మల్లీశ్వరి గారు, కళాధర్,రామబుద్ధుడుగారు, లింగారెడ్డిగారు, గదాధర్,అంబటి భానుప్రకాష్, సుజాతగారు, భవానిగారు, శ్రీదేవి రాపూర్ గారూ, మన్నెలలితగారు, పిన్నక నాగేశ్వరరావు గారూ,గోగులపాటి కృష్ణమోహన్, గుడిపల్లి వీరారెడ్డి గారు, అమరకుల గారు, వెల్ది ఇందిర చెల్లెమ్మ, దాసోజు పద్మావతి గారు, రమక కృష్ణమూర్తిగారూ, లక్ష్మీమదన్ గారు, పద్మజ గారు, దండ్రెరాజమౌళిగారు, అంజయ్యగౌడ్ గారు, మధుసూధన్ గారు ఇంకా చాలామంది నా కవితలకు సానుకూలంగా స్పందించి నన్నుత్సాహపరిచేవారు. వీరు తొలినాళ్ళలో ఉత్సాహపరచిన కవులు మాత్రమే…తరువాత్తరువాత చాలామంది మితృలు సోదర సోదరీ మణులు నాకు ప్రోత్సాహమిచ్చారు.ఇంకా అనేకమంది మిత్రులు నన్ను సహృదయంతో ప్రోత్సహించారు. పేర్లు అందరివీ చెప్పటం సాధ్యం కాదు కనుక అన్యధాభావించవలదని మనవి. అందరి సహకార ప్రోత్సాహాలకూ శిరసువంచి నమస్కరించి ధన్యవాదాలు తెలియ జేసు కుంటున్నా. ఈ ప్రయాణంలో మిత్రుడు మేక రవీంద్ర ప్రోత్సాహం మరువలేనిది.
ముఖ్యంగా పెన్నుపేపర్ లేకుండా ఆలోచన వచ్చిన వెంటనే అక్షరీకరించగలిగే చరవాణీ సౌకర్యం బాగా నచ్చింది.
ముఖ్యంగా వారిలో ఎక్కువగా స్నేహం ఎవరితో అంటే మొదటివాళ్ళెప్పుడూ మొదటివారే అన్నట్లు. గుడిపల్లి వీరారెడ్డి ఆయన వైవిధ్యమైన కవిత్వంతో మంచి స్నేహపూర్వక వ్యక్తిత్వంతో నాకు దగ్గరైనారు , ఎమ్ వీ ఎల్ గారు నాకిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది , గోగులపాటి కృష్ణమోహన్ మరియు బండికాడి అంజయ్య గౌడ్ గారు,గదాధర్ గారు, పిన్నక నాగేశ్వరరావుగారు నన్ను పద్యరచనలో ప్రోత్సహించి ఉత్సాహపరిచేవారు
ఇక లచ్చిరెడ్డి అమరకుల తమ్ముడు తన ప్రత్యేకమైన చిత్రకవితలతో తనకే సాధ్యమైన శైలిలో నా చిత్ర కవిత్వానికి స్ఫూర్తిఐనారు. “అగ్రజా”అన్నపిలుపుతో దగ్గరైనారు.
కవితా శైలి పరంగా పదాల గాఢత పరంగా రాజావాసిరెడ్డి
మల్లీశ్వరి గారిది మరొక విశిష్టశైలి.
అందరూ ఆప్యాయంగా ‘అన్నా”తమ్ముడూ’లేదా ‘నేస్తం’అవి పలుకరించేవారే.
ఆ తరువాత నా పద్యాల పరిశీలనకు మరో మంచి గురువుగారి పరిచయం ఐనది. ఆయనే నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి గురువుగారు. కవిత్వంలో మెళకువలు,వ్యాకరణం, లయ, ఇంకా ఎన్నో ప్రక్రియల గురించి ఓపిగ్గా నేర్పించారు.
ఆతరువాత కథా ప్రక్రియలోకి వెళ్ళాక.ప్రియమైన రచయితలు,ప్రియమైన కథకులు గ్రూపులు పరిచయం ఐనవి. అక్కడ పేరెన్నికగన్న హేమాహేమీలైన కథారచయిలతో,కవులతో కవితలూ కథలూ పంచుకుంటూ,నేర్చుకుంటున్నా. ముఖ్యంగా అడ్మిన్లు ఇందూరమణగారు, రామశర్మగారు, చొక్కర తాతారావుగారు, వాణి గారు,భారతిగారూ,కోనేగారూ,మంచాల శ్రీలక్ష్మిగారూ,చక్రపాణీ గారు ఉత్సాహపరుస్తూ పోటీల వివరాలను అందిస్తూ మంచి ప్రోత్సామిస్తున్నారు.
ఇంతమంచి మితృలను,ఆత్మీయులనూ నాకందించిన సాహితీ వాణికి శతకోటిదండాలు.
5).అమరకుల గారు మీకు ముందు నుండి
పరిచయం ఉన్నారా లేక మధ్యలో పరిచయమయ్యారా?
జ): మధ్యలో కంటే ముందు అనొచ్చేమో!….
నా కవిత పద్య రచనలు సాగుతున్న సందర్భంలో
అమరకుల చిత్రాలు పోస్ట్ చేస్తూ వాటికి న్యాయంచేసేలా చక్కని చిక్కని అంతు చిక్కని భావంతో రాసిన కవిత్వం నన్ను ఆకర్షితుడిని చేసాయి.ఇదేదో కొత్తగా వున్నట్లనిపించింది. పిల్లవాడికి కొత్తబొమ్మ దొరికితే దాన్తో ఎక్కువ ఆడుకోవాలనిపిస్తుంది. నేను చిన్న పిల్లాడిలా ఆ చిత్రమైన చిత్రకవితలను చిత్తరువులా చూస్తుండిపోయాను. అన్ని కవితలకూ నా స్పందనలు తెలిపే వాడిని, ఆయన శైలిలో రాద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను . అది ఆయన స్వంతం అని అర్థమైంది. కానీ ఆయన కవితల స్ఫూర్తిగా నేనుకూడా కొన్ని చిత్రకవితలను వ్రాసి అందరినీ మెప్పింప గలిగాను ఇప్పటికీ వ్రాస్తూనే వున్నాను . ఆయన కూడా “అగ్రజా”అని ఆప్యాయంగా నన్ను సంబోధిస్తూ,నాకు ప్రియమైన తమ్ముడిగా మారాడు. నా సాహితీ ప్రస్థానంలో నాకు దొరికిన అత్యంత ఆత్మీయులలో అమరకుల ఒకరు.
6).కళాపీఠం నకు మీరు ఎలాంటి సేవలు అందించారు?
జ).కళా పీఠం వారు నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలన్నింటిలో పాల్గొని కార్యక్రమం విజయం పొందడంలో సహకరించాను. వారు నిర్వహించిన సాహితీ
సదస్సులన్నింటిలో పాల్గొన్నాను. సంకలానాలకు కవితలందించాను. వారు అప్పచెప్పిన రాణీ శంకరమ్మ స్క్రిప్ట్ రచనకు పూనుకున్నాను. భవిష్యత్తులో నా వలన ఎలాంటి సేవ కావాలన్నా చేయటానికి నేను రెడీ.!.
7).మీరు ఇప్పటి వరకూ ఏఏ రచనలు చేశారు?
జ).నేనిప్పటి వరకూ 13 రకాల సాహితీ ప్రక్రియలలో రచనలు చేసాను.
(ముద్రితాలు)
వన సంరక్షణ కవితా సంకలనం “ఆకుపచ్చని నేస్తం”లో నా కవిత “వృక్షవేదన-పుడమి రోదన”
“చిట్టిమనసుల గట్టి సంకల్పం”కథ సాహితీకిరణం మాసపత్రికలో ప్రచురించబడినది
“జడకందములు”కవితా సంకలనానికి పద్యాలు వ్రాసారు.
“మేము సైతం “శ్రీశ్రీ గారిపై సంకలనానికి కవితనందించారు
“కవి విశ్వంభరుడు”డా.సినారే గారిపై కవితాసంకలనానికి
కవితనందించారు.
“వీరసైనికా వందనం” సంకలనానికి కవితనందించారు.
కాళేశ్వరం సంకలనానికి కవితనందించారు.
అక్షరాల తోవ కవితా సంకలనంలో జాతీయస్థాయి బహుమతి కవిత .
అక్షరాల తోవ సింగిల్ పేజీ కథల సంపుటిలో “తస్మైశ్రీ గురువే నమః” కథ.
“నీహారిక”గొలుసుకట్టు నవల ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడినది.
“నేనుసైతం “నా కవితా సంపుటి ఆవిష్కరించాను.
ఇంకా పలు సంకలనాలలో కవితలు ప్రచురితము.
అముద్రితాలు
1 వచన కవితలు 2000 పైన
2 “జీవన సత్యాలు ఆటవెలది శతకం(100పద్యాలు)
3 ఆటవెలది శతకం(నామకరణచేయలేదు) (100పద్యాలు)
4 కందశతకము ఒకటి(నామకరణచేయలేదు) (100పద్యాలు)
5.ఇతర తేటగీతి పద్యాలు 50
6.ఇతర ఆటవెలదిపద్యాలు 160
మొత్తం పద్యాలు 510
కథలు:..20కథలు(స్వచ్ఛపల్లె కథ తెలుగువేదికలో ప్రచురించబడినది) (కొన్ని ప్రతిలిపిలో ప్రచురించబడినవి)
“చిట్టిమనుషుల గట్టిసంకల్పం”కథకు సాహితీకిరణం మాసపత్రిక ఆద్వర్యంలో మట్టూరికమలమ్మ స్మారక కథల పోటీలో బహుమతి.
భిలాయి వాణి పత్రికలో సాధారణప్రచురణకు స్వీకరించిన వి కొన్ని.
6 నానీలు:250
7 పాటలు ,.30( ‘avera videos’ you tube channel లో ఆడియో వీడియోలు పబ్లిష్ చేసినవి రెండు)
8 వ్యాసములు:
A.గ్లోబల్ వార్మింగ్(తెలుగువేదికలో ప్రచురితము)
B.అంశం:ప్రస్తుత సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో యువత పాత్ర బాధ్యత.
9 అవేరా వ్యంగోక్తులు(జోక్స్)–30
10 బుర్రకథ1రైతేరాజు(you tube channel కోసం రికార్డింగ్ లో (ఆడియోవీడియో)వుంది)
11.రుబాయిలు..10
12.గజల్స్…20
13.'”ఓ సుమతి కథ” నవల
త్వరలోనే సాహిత్యంలో మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను.
**’avera videos’ నా యూట్యూబ్ చానల్ లో రెండుపాటలు నా స్వీయ రచనలు రికార్ట్ చేసి వీడియోలు
పబ్లిష్ చేసాను.అందరూ పాటలు చూసి నా చానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పది పాటలు రికార్డింగ్ లో వున్నాయి. మిస్ కాకుడదంటే avera videos subscribe చేయండి.
8).మీ రచన నేను సైతం నేనూ చదివాను
ఎంతో ఉద్వేగంగా రాశారు కారణం ఏమిటి?
జ). ఏ కవికైనా ప్రాథమికంగా వుండవలసింది స్పందించే హృదయం. కలంలో భావకవిత్వం ఒలకాలన్నా,
అభ్యుదయ భావం పొంగాలన్నా, నవరసాలలో సాహిత్యం
అందించాలన్నా అతనిలో రసాస్వాదనా హృదయం వుండాలి. సమకాలీన సమాజంలో నిత్యం ఎన్నో సంఘటనలు, నేరాలు, ఘోరాలు ఎందరి కన్నీళ్ళకో కారణమౌతున్నాయి. ఆ కన్నీళ్ళను మనం చేత్తో తుడవలేక
పోయినా మన కలంలో సిరాగా మార్చి అక్షరాలనే మేల్కొలుపు గీతాలుగా,కవనాలుగా మార్చి సమాజంలోనికి వదిలితే వాటిలో దమ్ముంటే ఒక గోరేటి వెంకన్న గారి పాటలా,లేదా గద్దరన్న పాటలా జనబాహుళ్యంలోకి వెళ్తాయి.
ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను వ్రాసిన కవితలు చాలావరకూ సమాజంలోని సమకాలీన సమస్యలూ,సంఘటనలనూ ప్రతిబంబంచేవే. వాట్సప్ లో ఎన్ని వేలకవితలు వ్రాసినా కవిగా గుర్తించరు.ఒక్క పుస్తకం ఐనా ప్రచురిస్తేనే వాడు కవిగా గుర్తింపు పొందుతాడని ఎవరో అన్నారు. అప్పుడే నేను సైతం ఒక కవితా సంపుటిని ప్రచురించి ఆవిష్కరించాలని సంకల్పించాను. అప్పటికే నేను 1300 కవితలు వ్రాసుకొని యున్నాను. పుస్తకానికి కవితలు సెలక్ట్ చేయాలంటే కష్టమని అర్థమైంది.ఏవో తోచిన కవితలను తీసి ‘నేను సైతం ‘కవితా సంపుటిలో పొందు పరచటం జరిగింది.ఇక పేరుగురించి ఆలోచించినప్పుడు ఎందుకో అభ్యుదయ కవిత్వానికి వేగుచుక్క నా అభిమాన కవి శ్రీశ్రీ గారు గుర్తొచ్చారు ఆయన కవితలోని నాకు నచ్చిన నా కవితా సంపుటికి నప్పిన పదం’నేను సైతం’నే నా కవితా సంపుటికి పేరుగా పెట్టుకున్నాను. ఈ పేరు ఖాయం చేసుకున్నాక వ్రాసిందే నేనుసైతం పుస్తకంలో నేనుసైతం కవిత.
ఇక మీరడిగిన ఉద్వేగమంటారా?..మనసులో ఉద్రేక ఉద్వేగాలు ఊగిపోయినప్పుడు మనం ఏది చెప్పినా కవితౌతుంది. నేనొక ప్రశాంత కడలిలా మీకు గోచరిస్తాను. కాని అగాథమౌ జలనిధిలో ఎన్నో అంతర తరంగ ప్రవాహా లుంటాయి. అల్లకల్లోలా లుంటాయి.అయినా
పైకి అది ప్రశాంతంగానే కనిపిస్తుంది.
ఆ కడలిని కవిత్వం చెప్పమంటే నా కవిత్వంలాగే వుంటుందేమో….మీ ప్రశ్నకు జవాబు అర్థమైందనుకుంటాను. సమకాలీన సమస్యలపైన విషయాలపైన నా మనసు గోస కాబట్టి ఉద్వేగంగానే వుంటాయి.
9).మీరచనలలో ఆవేశం సమాజంలో పలురకాల కోణాలను సృజించారు కారణం ఏమిటి?
జ).కవికి హ్రస్వదృష్టి వుండకూడదు. విశాల దృష్టితో డేగకళ్ళతో తన చుట్టూ వున్న సమాజంలోని అణువణువునూ శోధించే నైజం వుండాలి. విషయ అవగాహన వుండాలి. నేను వస్తు వైవిధ్యానికి ప్రాముఖ్యతనిస్తాను. విషయ అవగాహన కోసం శోధిస్తాను. కొత్తదనం వుంటేనే పాఠకుడికి చదవాలనే వుత్సాహం కలుగుతుంది ఆ వస్తువు తమ మధ్యలోనే వుందంటే ఆ ఉత్సాహం రెట్టింపు అవుతుంది.ఆవేశం అంటారా జడత్వం ఆవహించిన ఆత్మలను మేలుకొల్పాలంటే ఆవేశం అవసరం. అందుకే నా కవితలలో ఆవేశం పొంగింది. అంతే కాకుండా సమకాలీన సమస్యలను నా మనసు అనుభూతించటం చేత ఆవేశపూరిత కవితగా
వచ్చియుంటుంది.
10).కళాపీఠంలో అమరకుల గారు రాయలోరి
సభలా కళకళలాడుతూ సప్తవర్ణాల సింగిడి
పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
దీనిపై మీ అభిప్రాయం?
జ).అమరుకుల సంకల్పం చాలా గొప్పది, మీ లాంటి వారు చేదోడువాదోడుగా ఉండి చేసే కృషి ,సేవాతృష్ణ ఇంకా గొప్పది, ఆయన చేపట్టిన ఈ యజ్ఞం విజయవంతంగా సాగుతుంది. మల్లినాథసూరి కళాపీఠం మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, కవితా లోకానికి ఓ గొప్ప
మార్గ దర్శని గా వుండి సాహితీ సేవ చేయాలని ఆశిస్తున్నాను. నేను చురుకుగా పాల్గొనలేక పోతున్నందుకు బాధగానే వుంది. రాయలోరి సభలో అష్టదిగ్గజాలే వుండేవారు. మన సింగిడిలో శతాధిక దిగ్గజాలున్నారని నమ్ముతున్నా.రకరకాల సాహితీ ప్రక్రియలతో సప్తవర్ణాల సింగిడి వర్ణ రంజితంగా సాగుతుంది. నిర్వహిస్తున్న అమరకుల బృందానికి అభినందనలు తెలియ చేస్తున్నాను.
11).కవివరా హైదరాబాద్ గ్రూప్లో కొన్ని అంశాలవరకు మీరు రాసి తర్వాత రాయలేదు
ఎందుకని నచ్చలేదా లేక మరోకారణం ఏమైనా
ఉన్నదా.
జ).సమయాభావం వలన అన్ని అంశాలకూ వ్రాయలేక పోయాను. ముఖ్యంగా స్వంత పనులు, నా యూట్యూబ్ ఛానల్ కోసం పాటలు వ్రాయటం, కొత్తగా కథలు వ్రాయటానికి ఎక్కువ సమయం కేటాయించటం వలన బిజీ ఐపోయి కొన్ని అంశాలకు మాత్రమే వ్రాసాను.
ఒకరోజు ఎలా ఐనా బాక్ లాగ్ అంశాలన్నీ వ్రాయాలని అనుకుని కాపీ చేసి నోట్ పాడ్ లో పెట్టుకున్నా కానీ వ్రాయలేక పోయాను. ఒకోసారి వ్రాయలేక పోతున్నా కదా గ్రూపు వదలి వచ్చేద్దా మనిపించినా అది తమ్ముడు అమరకుల గ్రూపు కాబట్టి ఆపని చేయలేక పోయాను.
గ్రూపు నచ్చకపోవటం ఏమీలేదు, మంచి అంశాలతో
మంచి సభ్యుల ఉత్సాహంతో బాగా నడుస్తుంది గ్రూపు.
నేను కూడా వ్రాస్తాను ముందు ముందు.
12).మీరు ఎఫ్భీలో వివిధ సమూహాలలో ఉన్నారు మీయొక్కఅనుభవాలు తెలియ చేయండి?
జ). నాకు మొదటినుండీ ఎఫ్ బీ మీద ఇంట్రెస్ట్ తక్కువ.కొంతమంది మితృలప్రోత్సాహంతో కొన్ని సాహిత్య గ్రూపులలో జాయిన్ అయ్యాను. పోటీలకు వ్రాసి బహుమతులు కూడా పొందాను. ఇప్పుడు వ్రాయట్లేదు.ఎక్కువ ఎఫ్ బీ కూడా చూడట్లేదు.ఏఏ గ్రూపుల్లో వున్నానో కూడా సరిగ్గా చూసుకోవట్లేదు.అనుభవాలేమిటంటే నేను పెట్టిన పోస్ట్ కవితలు నచ్చిచాలా ఫ్రండ్స్ రిక్వెస్ట్ లు వచ్చేవి నా ఫ్రండ్స్ లిస్ట్ పెరిగింది.
13).నేటి రచయితలలో కొందరు శాలువాలు సన్మానాలపై చూపే ఆసక్తి రచనలపై చూపడంలేదు ఎందుకనీ మీఅభిప్రాయం తెలుపండి?
జ).ఎందుకంటే ఏంచెప్పను? నేటి రచయితలలో కొందరిలో తమను తాము ఇతరులకంటే అధికులుగా చాటి చెప్పుకోవాలనే తపన, ఒక రకంగా కీర్తి కండూతి అనవచ్చేమో. అలాగని శాలువా కప్పించుకున్న అందరికీ ఇది వర్తించదు. శాలువా సన్మానం అనేవి ఒక సంప్రదాయం.
మనవిజయాలు మనని సన్మానింపజేస్తాయి. కవులు ఆ విజయాల వైపు చూడాలి పోటీలలో గెలవాలి. అంతే తప్పశాలువా సన్మానలకై అర్రులు చాచకూడదు.మంచి రచనలు చేయాలి వారి ప్రతిభను చాటాలి. గంగిగోవుపాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు,’అన్నట్లు పనికిమాలిన సన్మానాలు వందకంటే ఒక్క ఉన్నతమైన సంస్థ ద్వారా ఉత్తమమైన సాహిత్య సేవకి పొందే సన్మానం ఘనమైనది. అవార్డులు కవిని వరించాలి కానీ, కవి అవార్డులను కాదు. కొన్ని సంస్థలు డబ్బులు కట్టించుకుని సన్మానాలు చేస్తుంటారు. అటువంటి వాటిని కవిసమాజం బహిష్క రించాలి. అంటే వారు విసిరే బిస్కట్ లను ఒదులుకోవాలి.
14).మీరు ఏయే సంకలనాలకు కవితనందించారు ఏయే రచనలు చేశారు తెలుపండీ?
జ).1.వన సంరక్షణ కవితా సంకలనం “ఆకుపచ్చని నేస్తం”లో నా కవిత “వృక్షవేదన-పుడమి రోదన”
2.జడకందములు”కవితా సంకలనానికి పద్యాలు వ్రాసాను
3.”మేము సైతం “శ్రీశ్రీ గారిపై సంకలనానికి కవితనందించాను
4.”కవి విశ్వంభరుడు”డా.సినారే గారిపై కవితాసంకలనానికి
కవితనందించాను.
5.”వీరసైనికా వందనం” సంకలనానికి కవితనందించాను.
6.కాళేశ్వరం సంకలనానికి కవితనందించారు.
7.అక్షరాల తోవ కవితా సంకలనంలో జాతీయస్థాయి బహుమతి కవిత .
8.అక్షరాల తోవ సింగిల్ పేజీ కథల సంపుటిలో “తస్మైశ్రీ గురువే నమః” కథ ప్రచురించబడినది.
ఇవే కాకుండా మరికొన్ని కవితా సంకలనాలకు కవితలనందించాను.
15).మీకు లభించిన బిరుదులు అవార్డులు తోటి రచయితలతో మీ అనుభవాలను వివరించండి?
జ).పురస్కారాలు / బిరుదులు:
1.సహస్ర కవిమిత్ర,
2.సహస్ర కవిరత్న,
3.సహస్ర కవిభూషణ,
4.గురజాడ ఫౌండేషన్ పురస్కారం,
- సహస్రవాణి శతపద్య కంఠీరవ,
6 సహస్రవాణి శతస్వీయ కవితాకోకిల,
7.2018లో అక్షరాలతోవ జాతీయస్థాయి కవితలపోటీలో బహుమతి పురస్కారం,
8.తెలుగు రక్షణ వేదిక బతుకమ్మ జాతీయ పురస్కారం,
9) 334455 నిముషాల పాటు నిరంతరాయంగా అనంతపురంలో జరిగిన రికార్డు కవిసమ్మేళనం తెలుగు రక్షణ వేదిక పురస్కారం,
10) యాదాద్రి లో రికార్డు సమ్మేళనం లో ఉదయకళానిధి వారి పురస్కారం
11) కరీంనగర్ లో జరిగిన రికార్డు కవిసమ్మేళనం కృషికవిత పురస్కారం.
12).ప్రియమైన రచయితలు గ్రూపులో సంకలన కథకు సన్మానం.
13).తెలుగుపూలతోట FB గ్రూపు కవితలపోటీలో విజేత
14).సృజనసాహితి గ్రూపులో కవితలపోటీలో విజేతగా
15).గో తెలుగు కెనడా వారి కవితలపోటీలో బహుమతి.
16).దాదా సాహేబ్ ఫాల్కే ఆవార్డు గ్రహీత డా. అక్కినేని నాగేశ్వర రావు జన్మదిన వేడుకలు సందర్బంగా, ఏఎన్ఆర్ విశిష్ట సేవారత్న అవార్డ్ .07/09/2019 పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా నందు బహూకరించారు.
17). సాహితీకిరణం మాస పత్రిక వారి ద్వారా మట్టూరి కమలమ్మ స్మారక కథల పోటీలో బహుమతి.
18).”సమన్విత”పత్రికలో కవితలపోటీలో బహుమతి.
19).”భిలాయివాణి”పత్రికలో కవిత సాధారణప్రచురణ.
ప్ర: ఇతర రచయితలతో అనుభవాలు చెప్పండి.
జవాబు:
నాకు వాట్సప్ పరిచయాలలో లెక్క పెడితే 100మంది పైన నాకు తెలిసిన మిత్రులే వుంటారు. నేను తెలిసిన సమూహసభ్యులు వేలమంది వుండొచ్చు.
నేను గమనించిందేంటంటే మగవాళ్ళకన్నా మహిళారచయితలే ఎక్కువగా వున్నారు. మంచి కవిత్వం కూడా వ్రాస్తున్నారు.