Pandugalu

అక్షయతృతీయ

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకుని డబ్బు లేకున్నా అప్పు చేసో, తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవడం అటుంచి చేసిన అప్పులు, తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి.

పురాణకథనం
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.

శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది. ఈ నాడు దానం, ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారదమహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత, ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు, సహస్రాదిత్య సంకాశుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ, విష్ణు, శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ, శంఖాది నినాదములచే మేల్కొలుపబడును. సర్వ ధర్మ పరాయణుడై, సర్వ సౌఖ్యములను పొంది, నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి, స్వయముగా జ్ఞానియై, అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.

ఈ తిథినాడు పదహారు మాష మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము. వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *