Sai Ashtottara ShatanamavaliSai Ashtottara Shatanamavali

షిరిడీసదనా శ్రీసాయీ

సుందర వదనా శుభధాయీ

జగత్కారణా జయసాయీ

నీ స్మరణే ఎంతో హాయీ || 1 ||

శిరమున వస్త్రము చుట్టితివీ

చినిగిన కఫినీ తొడిగితివీ

ఫకీరువలె కనిపించితివీ

పరమాత్ముడవనిపించితివీ || 2 ||

చాందుపాటేలుని పిలిచితివీ

అశ్వము జాడ తెలిపితివీ

మహల్సాభక్తికి మురిసితితివీ

సాయని పిలిచితె పలికితివీ || 3 ||

గోధుమ పిండిని విసరితివీ

కలరా వ్యాధిని తరిమితివీ

తుఫాను తాకిడి నాపితివీ

అపాయమును తప్పించితివీ || 4||

అయిదిళ్లలో భిక్షడిగితివీ

పాపాలను పరిమార్చితివీ

బైజాసేవను మెచ్చితివీ

సాయుజ్యమునూ ఇచ్చితివీ || 5 ||

నీళ్ళను నూనెగ మార్చితివీ

దీపాలను వెలిగించితివీ

సూకరనైజం తెలిపితివీ

నిందలు వేయుట మాన్పితివీ || 6 ||

ఊదీ వైద్యము చేసితివీ

వ్యాధులనెన్నో బాపితివీ

సంకీర్తన చేయించితివీ

చిత్తశాంతి చేకూర్చితివీ || 7 ||

అల్లా నామము పలికితివీ

ఎల్లరి క్షేమము కోరితివీ

చందనోత్సవము చేసితివీ

మతద్వేషాలను మాపితివీ || 8 ||

కుష్ఠురోగినీ గాంచితివీ

ఆశ్రయమిచ్చీ సాకితివీ

మానవధర్మం నెరిపితివీ

మహాత్మునిగ విలసిల్లితివీ || 9 ||

ధునిలో చేతిని పెట్టితివీ

కమ్మరిబిడ్డను కాచితివీ

శ్యామా మొర నాలించితివీ

పాము విషము తొలిగించితివీ || 10 ||

జానెడు బల్లను ఎక్కితివీ

చిత్రముగా శయనించితివీ

బల్లి రాకను తెలిపితివీ

సర్వజ్ఞుడవనిపించితివీ || 11 ||

లెండీ వనమును పెంచితివీ

ఆహ్లాదమునూ పంచితివీ

కర్తవ్యము నెరిగించితివీ

సోమరితనమును తరిమితివీ || 12 ||

కుక్కను కొడితే నొచ్చితివీ

నీపై దెబ్బలు చూపితివి

ప్రేమతత్వమును చాటితివీ

దయామయుడవనిపించితివీ || 13 ||

అందరిలోనూ ఒదిగితివీ

ఆకాశానికి ఎదిగితివీ

దుష్టజనాళిని మార్చితివీ

శిష్టకోటిలో చేర్చితివీ || 14 ||

మహల్సా ఒడిలో కొరిగితివీ

ప్రాణాలను విడనాడితివీ

మూడు దినములకు లేచితివీ

మృత్యుంజయుడనిపించితివీ || 15 ||

కాళ్ళకు గజ్జెలు కట్టితివీ

లయ బద్ధముగా ఆడితివీ

మధుర గళముతో పాడితివీ

మహదానందము కూర్చితివీ || 16 ||

అహంకారమును తెగడితివీ

నానావళినీ పొగడితివీ

మానవసేవా చేసితివీ

మహనీయుడవనిపించితివీ || 17 ||

దామూ భక్తికి మెచ్చితివీ<

సంతానమునూ ఇచ్చితివీ

దాసగణుని కరుణించితివీ

గంగాయమునలు చూపితివీ || 18 ||

పరిప్రశ్నను వివరించితివీ

నానాహృది కదిలించితివీ

దీక్షితుని పరీక్షించితివీ

గురుభక్తిని ఇల చాటితివీ || 19 ||

చేతిని తెడ్డుగ త్రిప్పితివీ

కమ్మని వంటలు చేసితివీ

ఆర్తజనాళిని పిలిచితివీ

ఆకలి బాధను తీర్చితివీ || 20 ||

మతమును మార్చితె కసరితివీ

మతమే తండ్రని తెలిపితివీ

సకల భూతదయ చూపితివీ

సాయి మాతగా అలరితివీ || 21 ||

హేమాదును దీవించితివీ

నీదు చరిత వ్రాయించితివీ

పారాయణ చేయించితివీ

పరితాపము నెడబాపితివీ || 22 ||

లక్ష్మీబాయిని పిలిచితివీ

తొమ్మిది నాణెములిచ్చితివీ

నవవిధ భక్తిని తెలిపితివీ

ముక్తికి మార్గము చూపితివీ || 23 ||

బూటీ కలలో కొచ్చితివీ

ఆలయమును కట్టించితివీ

తాత్యా ప్రాణము నిలిపితివీ

మహాసమాధీ చెందితివీ || 24 ||

సమాధి నుండే పలికితివీ

హారతినిమ్మని అడిగితివీ

మురళీధరునిగ నిలిచితివీ

కరుణామృతమును చిలికితివీ || 25 ||

చెప్పినదేదో చేసితివీ

చేసినదేదో చెప్పితివీ

దాసకోటి మది దోచితివీ

దశదిశలా భాసిల్లితివీ || 26 ||

సకల దేవతలు నేవెనయా

సకల శుభములను కూర్చుమయా

సతతమునిను ధ్యానింతుమయా

సద్గురు మా హృదినిలువుమ్మయా || 27 ||

సాయీ నక్షత్రమాలికా

భవరోగాలకు మూలికా

పారాయణ కిది తేలికా

ఫలమిచ్చుటలో ఏలికా

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *