Table of Contents
Simhachalam : Discover the Awe-Inspiring Temple with Majestic ViewsSimhachalam
సింహాచల క్షేత్రం Simhachalam Temple
సింహాచల క్షేత్రం
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.
దశావతారాల్లోని రెండు అవతారాలు కలగలసిన అరుదైన స్వరూపమే సింహాచల క్షేత్రం లోని వరాహనరసింహావతారం. తన భక్తుడైన ప్రహ్లాదునికిచ్చిన మాట కోసమై హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారమూ కలిసి వరాహ లక్ష్మీనరసింహావతారం గా భక్తులకు అభయమిస్తున్నారు. స్వామివారు త్రిభంగి ముద్రలో అనగా వరాహము యొక్క తల, మానవ శరీరము, సింహం తోక కలిగిన మూర్తిగా దర్శనమిస్తారు.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
Simhachalam Temple – స్థలపురాణం:-
తన అన్నహిరణ్యాక్షుని చంపినవాడని హరి మీద ద్వేషం పెంచుకున్న హిరణ్యకశిపుడు, స్వయంగా తనకు కలిగిన బిడ్డే హరిభక్తుడు కావడం సహించలేకపోయాడు. కన్నమమకారాన్ని కూడా చంపుకుని, పసివాడని కూడా చూడకుండా, అతని హరిభక్తిని మానిపించడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. అయినా వినకపోవడంతో అనేక రకాల చిత్రహింసలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు. విష సర్పాలతో కరిపించాడు. అగ్ని జ్వాలల మధ్య పడవేయించాడు. నిరంతర హరినామస్మరణతో, భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ప్రహ్లాదుడిని అవి ఏ రకంగానూ బాధపెట్టలేకపోయాయి. చివరికి ఒక కొండపైనుండి సముద్రంలోనికి తోసివేయించే ప్రయత్నం చేసాడు. ఆ కొండయే సింహాచలమనీ, ఎన్ని ఆపదలొచ్చినా, తన భక్తులను ఏదో ఒక విధంగా కాపాడుతూ ఉండే శ్రీమన్నారాయణుడు సముద్రంలో పడిపోకుండా ప్రహ్లాదుడిని కాపాడాడనీ, అప్పుడు ప్రహ్లాదుడు, తనను కాపాడటానికి ద్వయావతారంలో(వరాహ, నరసింహ) వచ్చిన విష్ణుమూర్తిని అదే రూపంతో సింహాచలం మీద వెలిసి, భక్తులను కరుణించమని వేడుకున్నాడనీ స్థలపురాణం చెప్తోంది.
హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదుడు సింహాచలం కొండపై వెలసిన స్వామికి దేవాలయం కట్టించాడు. కానీ కృతయుగం చివరికి అది శిథిలమైపోగా, విగ్రహం చుట్టూ మన్ను పుట్టలా కట్టింది. తర్వాతి యుగంలో చంద్ర వంశం లోని వాడైన పురూరవుడు ఊర్వశితో కలిసి ఆ ప్రాంతాలలో ఆకాశమార్గాన విహరిస్తుండగా, సరిగ్గా స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఆయన రథం ఆగిపోవడంతో, అక్కడ ఏదో శక్తి ఉందని భావించి, క్రిందకి దిగాడు. ఆయన మట్టితో కప్పబడిన విగ్రహాన్ని చూసి, చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామివారిని చందనంతో కప్పి ఉంచమని, కేవలం సంవత్సరానికి ఒక్క రోజు(అక్షయ తృతీయ- వైశాఖ శుద్ధ తదియ) మాత్రమే స్వామి నిజరూప దర్శనంతో అనుగ్రహిస్తారనీ పలికింది. అప్పుడు పురూరవుడు స్వామివారి మూర్తిని చందనంతో పూత పూసి ఆలయం నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకూ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. చందనపు పూతతో ఉన్న స్వామి లింగాకారుడిగా దర్శనమిస్తాడు.
క్రీ.శ.1087 : సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు. స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం. ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది.
క్రీ.శ.1198 : “వాయు స్ఫటికామలాభవపుషే సింహాచలస్థాయినే” = సింహాద్రి నాధుని స్పాటికామలాభ వపువుగా వర్ణించబడింది.
క్రీ.శ.1266 : గాంగ నరసింహ చక్రవర్తి స్వామి సన్నిధిలో సంకీర్తనం కోసం నూరుగురు స్త్రీలను స్వామివారికి సమర్పిస్తాడు.
క్రీ.శ.1268 : ఒక శాసనం ఈనాటికీ వ్యవహారంలో ఉన్న అడవివరాన్ని పేర్కొన్నది.
క్రీ.శ.1201, 1291 : రెండు శాసనాలు దేవాలయంలో వేద పఠన, అధ్యయన వైభవాన్ని తెలియజేస్తున్నాయి.
క్రీ.శ.1293 : అక్షయ తృతీయనాడు చందన కర్పూరాలు చాదడానికి ఒక నిబంధన చేస్తూ, ఆనాడే పాయసము, అప్పాలు మొదలైన పణ్యారాల ఆరగింపు కోసం నిబంధన కనబడుతుంది.
క్రీ.శ.1342 : స్వామికి ఒక మహారాణి అనంత లక్ష్మీదేవి అనేక ఆభరణాలు సమర్పించింది. అందులో బంగారు పొగడపూల మాల, సంపెంగ మాల లున్నాయి.
క్రీ.శ.1350 : వీరనరసింహదేవుల రాణి గంగా మహాదేవి దేవునికి అనేక సమర్పణలు కావిస్తూ వేయించిన శాసనం.
క్రీ.శ. 1371 : సింహాచలం అన్న పేరు సింహికారోగిరిః నుండి వచ్చినట్లు చెబుతోంది.
క్రీ.శ. 1394 : సింహగిరి నరహరిని అహోబల దేవరగా పేర్కొనటం జరిగింది.
Simhachalam Temple – సింహాచల గోపురం
ఈదేవాలయము లాంగూల గజపతిచే నిర్మించబడినది పలు శాసనములు తెలుపుచున్నవి.ఈ ఆలయమునందలి శాసనకాలము క్రీ.శ.1100 నుండి 7శతాబ్దములవరకు వరకు వ్యాప్తము.తూర్పుగాంగులు, రెడ్డిరాజులు, నందపురమును పాలించిన శిలావంశయుజులు, మత్స్య వంశీయులు, గజపతులు స్వామికి అనేకదానములు గావించిరి.శక సం.1438,1441 లలో కృష్ణ దేవరాయలు స్వామిని సేవించినాడు.శక సం.1438లో కృష్ణదేవరాయలు చిన్నాదేవీ తిరుమలదేవీ సహితుడై ఇక్కడకేతించి స్వామిని అనేక అలంకారములు అర్పించెను.కైంకర్యములను అర్పించెను.అనేక గ్రామములను క్రీ.శ.1441లో ధారపోసినాడు.
గజపతులు పతనమైన తరువాత కుతుబ్ షాహీ వంశము వారు లీప్రదేశముపై దండెత్తి దేవాలయ సంపదను దోచుకొనినారు.క్రీ.శ.1604లో పద్మనాయక కులుడను విప్పర్ణ గోత్రుడును అగు సర్వప్ప అశ్వరాయుడు స్వామికి నిత్యనైవేద్య రాగభోగములను పునరుద్ధరించి అవి యవిచ్చిన్నముగా జరుగునిమిత్తము నరవ అను గ్రామమును సమర్పించెను.
మిధ్య యుగమున ఈక్షేత్రము విద్యా కేంద్రమని పెక్కు శాసనములవలన అవగతమగుచున్నది.శక సం.1275లో గంగానరసింహ భోగకాలమున పురాణములు పఠించు బ్రాహ్మణులకు జీతమిచ్చునిమిత్తము శృఈ భంఢారమున 52 మాడలను గంగాదేవి యొసగినది.శా.సం.1305లో సంహాచల మందలి బ్రాహ్మణులకు వేదము చెప్పుటకు జంపూ మహాసేనాపతి యొడ్య పెద్దిభట్టును నియమించెను.పురాణ కావ్య నాటక వ్యాకరణ కాండవ తైత్తిరీయశాఖలను బోధించు బ్రాహ్మణులకు అదేవిధముగా నారాయణా సేనాపతి నిబంధముల నిచ్చెను.
కూచిమంచి తిమ్మకవి (1690-1757) కట్టమూరి కామేశ్వరకవి (1830-90) సింహాచల మాహాత్మ్య శ్రీ లక్ష్మీనృసింహ చరిత్రము లనుపేర పేర రచించిన ప్రబంధముల సింహసైల మహాత్మ్యమును వర్ణించిరి.కూచిమంచి తిమ్మకవి 5అశ్వాసముల కావ్యముగా తెలుగులో రచియించి గౌరీవల్లభునికి అంకితమిచ్చినాడు.
Simhachalam Temple – ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు – వారు సమర్పించిన కానుకలు
విశిష్టాద్వైతము నకు ఆద్యుడైన రామానుజులవారు శైవగమన పద్ధతిని వైష్ణవ సాంప్రదాయంలోకి (ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు.
క్రీ.శ.1098 నాటి చోళరాజు కులోత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్టు విశదమవుతుంది. మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు, 13వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంతంలోనున్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి.
శ్రీ కృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని రెండు సార్లు (క్రీ.శ.1516, క్రీ.శ.1519లో) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది.
14-15 శతాబ్దములలో [1428] కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని, సింహాద్రి నాథుని దర్శించి నిర్మించిన శ్రీ కృష్ణదేవరాయల విజయ ధ్వజము శిలా శాసనము ఉంది. ఇదేకాక, క్షేత్ర పరిసరాలలో క్రీ.శ.1098 తరువాత చెక్కిన దాదాపు ఐదు వందల శిలా శాసనాలు ఉన్నాయి.
గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు
Simhachalam Temple – ఆలయ విశేషాలు
సింహాచల దేవాలయ సింహ ద్వారము లోపలి నుండి కనిపించే దృశ్యము
Simhachalam Temple – గాలి గోపురము-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.
కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు (కప్పం:పన్ను) చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
సింహాచలం దేవాలయ వెనుకభాగంలో నరసింహుని విగ్రహం.
సింహాచలం వద్ద గంగధార
జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకొన్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానంచేసి దైవదర్శనానికి వెళతారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగములో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కల్యాణము తరువాత ఈ ఘట్టంలో స్నానము ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహ స్వామి విగ్రహం ఉంది.
భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందినది.
కొత్తగా నిర్మించిన విచారణ కార్యాలయం.
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.
మాధవధార
మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.
పండుగలు
సంవత్సరంపొడుగునా సింహాచలేశునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని:
పెళ్ళి కొడుకును చేయటం ముహుర్తపు రాట: చైత్ర శుద్ధ పాడ్యమి
కల్యాణ మహోత్సవాలు: చైత్ర శుద్ధ దశమి నుండి చైత్ర బహుళ పాడ్యమి వరకు
రథోత్సవం: చైత్ర శుద్ధ ఏకాదశి
చందనోత్తరణం: వైశాఖ శుద్ధ విదియ నాటి రాత్రి స్వామివారి విగ్రహం మీది చందనాన్ని తీసివేస్తారు. దీనిని చందనోత్తరణం అంటారు.
చందనోత్సవం : వైశాఖ శుద్ధ తదియ నాడు పగటి పూట నిజరూప దర్శనం, చందనోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తదియనాటి రాత్రి చందన సమర్పణ. ఈ రోజు పగలు స్వామివారి నిజరూప దృష్టి పడటంవలన సింహాచలప్రాంతమంతా ఎండవేడితో సెగలు, భుగలుగా ఉంటుందంటారు. (అక్షయ తదియకి లక్షల జనం వస్తారు. ఆనాడు నరసింహస్వామికి (అప్పన్న) పూసిన గంధం ఒలిచి, నిజరూప దర్శనం చూపిస్తారు).
వైశాఖ పూర్ణిమ : ఈ రోజున స్వామివారికి రెండవ విడత చందన సమర్పణం చేస్తారు.
జ్యేష్ఠ పూర్ణిమ : స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం
శయనోత్సవం: ఆషాఢ శుద్ధ ఏకాదశి
ఆషాఢ పూర్ణిమ : స్వామి వారికి నాలుగవ సారి చందన సమర్పణం
గిరి ప్రదక్షిణ : ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించడం. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన వున్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 క్.మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు, మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు, ఆలయంలోనే ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసే రోజున భక్తులకు ఆ గిరి ప్రదక్షిణం జరిగే బాటలో వున్న గ్రామాల వారు, స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు, నీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందించి భక్తులకు సేవ చేస్తారు.సింహాచలం అప్పన్న గిరిప్రదక్షిణ సందర్భంగా ఎన్.ఎ.డ్. గోపాలపట్నం పరిసరాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సింహాచలంలో సాయంత్రం అప్పన్న రథం ప్రారంభం నుంచి ఉదయం వరకు గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు రక్షణ కల్పించి అవసరమైన్ సహాయం అండెంచేలా సిబ్బందిని నియమించారు. కంచరపాలెం నుంచి సింహాచలం వరకు 15 పాయింట్నలు గుర్తించారు. ప్రతి పాయింటు వద్ద ఇద్దరు పోలీసు సిబ్బంది పహరా కాస్తారు. అత్యధికంగా స్త్రీలు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నందున భద్రతను పెంచారు. ఎన్.ఎ.డి, గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు 50మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది పనిచేస్తారు. మరో రెండు మొబైలు బృందాలు ప్రతీ క్షణం పహరా తిరుగుతుంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటలవరకు సింహాచలం నుంచి హనుమంతవాక వరకు ఒక బృందం, హనుమంతవాక నుంచి కంచరపాలెం, మాధవధఅర, ఎన్.ఎ.డి మీదుగా గోపాలపట్నం, సింహాచలం వరకు ఒక బృందం ప్రతీక్షణం గస్తీ తిరుగుతుంది. కొందరు భక్తులు సింహాచలం తొలిపావంచా నుంచి బయలుదేరి హనుమంతవాక మీదుగా అప్పుఘర్ చేరుకుని, సముద్రస్నానాలు చేసి మాధవధఅరలోని మాధవస్వామిని చేరడానికి రారి 2.30 నిమిషములకు బయలు దేరుతారు. వీరు పోర్టు వెనుక నుంచి కైలాసపురం నివాసప్రాంతాల మీదుగా ఎన్.ఎ.డి చేరుకుంటారు. వీరందరికి ప్రత్యేక భద్రతకు ఒక పోలీసు టీము తిరుగు తుంది. రథంతో పాటు ఒక ఇన్‌ఛార్జి అధికారి ఆధ్వర్యంలో పోలీసు భద్రతా దళం ఉంటుంది. ప్రతినిమిషము అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు. 5వ పట్టణ పోలీసులు ప్రత్యేక బృందంగా తిరుగుతారు. భక్తుల సౌకర్యార్ధం సింహాచలం దేవస్థానం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. రెండు మూడు కి.మీ.కు ఒక శిబిరం ఏర్పాటు చేసింది. భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి, మంచినీరు తీసుకోవటానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్.ఏ.డి కూడలి, గోపాలపట్నం పెట్రోలు బానికి వద్ద సహాయం చేసే శిబిరాలను దేవస్థానం వారు ఏర్వాటు చేసారు.
కరాళ చందనం : శ్రావణ పూర్ణిమ నాడు స్వామి వారికి చందనమలదడం. ఇది కరాళ చందన సమర్పణ
పవిత్రోత్సవం :బాధ్రపద శుద్ధ దశమి నుండి చతుర్దశి వరకు. స్వామివారి నిత్యనైమిత్తికాలలో తెలిసిగాని, తెలియకగాని జరిగిన దోషనివారణకోసం జరిపే ఉత్సవం.
శరన్నవ రాత్రులు: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి.
విజయదశమి, శమీపూజ: ఆశ్వయుజ శుద్ధ దశమి. స్వామి వారు కొండ క్రింది పుష్పక వనానికి వచ్చి, జమ్మి వేట సాగిస్తారు.
క్షీరాబ్ధి ద్వాదశి : కార్తీక శుద్ధ ద్వాదశి.
వైకుంఠ ఏకాదశికి 10రోజుల ముందు పగల్ పత్తు 10రోజుల తరువాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి
రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు
గోదా కళ్యాణం : ధనుర్మాసం చివర భోగినాడు జరుగుతుంది.
మకరి వేట : మకర సంక్రాంతి వెళ్లిన మరునాడు కనుమ రోజున స్వామివారు కొండ క్రింద పుష్పకవనంలోని జలాశయంలో మొసలి బారి నుంచి గజేంద్రుని రక్షించడం.
తెప్పోత్సవం : పుష్య బహుళ అమావాస్య. కొండ క్రింది వరాహ పుష్కరిణిలో స్వామి వారు తెప్పతిరునాళ్లు జరుపుకోవడం.
డోలోత్సవం : ఫాల్గుణ పూర్ణిమ. కొండ క్రింది ఉద్యానవనంలో స్వామివారు రంగేళి జరుపుకుంటారు తన అక్క పైడితల్లి అమ్మని పిల్లని అడగటానికి వెళ్తారు
నరసింహ జయంతి : సౌర మాన వృషభ మాసంలో వైశాఖ శుద్ధ చతుర్దశి.
టిక్కెట్లు దొరికే స్థలాలు:
అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.10 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
ప్రసాదాల ధరలు
లడ్డూ(80గ్రాములు): రూ.10
పులిహోర : రూ.8
చక్కెర పొంగలి: రూ.5
రవ్వ లడ్డూ : రూ.5
ప్రధాన పూజలు
1. స్వామి వారి నిత్యకల్యాణం: టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. 2. స్వర్ణ పుష్పార్చన: టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
ఇతర సేవల ధరలు
సహస్రనామార్చన: రూ.200
అష్టోత్తర శతనామార్చన: రూ.100
లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
గరుడ సేవ: రూ.300
కప్పస్తంభ ఆలింగనం: రూ.25
లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
గోపూజ: రూ.50
గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
పశువుకట్టు: రూ.15
అన్నప్రాశన, అక్షరాభ్యాసం: రూ.50
ద్విచక్రవాహన పూజ: రూ.100
కారు పూజ: రూ.200
కేశఖండన: రూ.10
దేవాలయంలో దర్శనవేళలు-ఉదయం 7 నుండి మధ్యహ్నం 11.30 వరకు తిరిగి 12.30 నుండి 2.30వరకు తిరిగి 3.30 నుండి7వరకు, సాయంత్రం 8.30 నుండిరాత్రి 9 వరకూ.దర్శనం లభిస్తుంది
దర్శన వేళలు
ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం
మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.
దర్శనం టిక్కెట్ల ధరలు
రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.
వసతి కొరకు-ఎ.పి.టి.డి.సి., చందన టూరిస్టు రెస్ట్ హౌస్, దేవాలయ సత్రములు, తిరుమల దేవస్థాన సత్రములు ఉన్నాయి.
చేరుకొనే విధానము
విశాఖపట్టణం వరకు బస్సు, రైలు, విమాన మార్గాలలో రావచ్చును. అక్కడ నుండి సింహాచలం కొండ క్రిందికి (అడవివరం) సుమారు 15 కి.మీ. లోపు దూరం ఉంటుంది. అక్కడికి సిటీబస్సు, ఆటో, టాక్సీలలో చేరవచ్చును. సింహాచలం కొండ క్రింది నుండి పైకి దేవాలయం వరకు మెట్లమీదుగా (సుమారు వెయ్యి మెట్లు) గాని, దేవస్థానంవారి ఘాట్ రోడ్డు మీదుగా దేవస్థానం బస్సులోగాని, టాక్సీలోగాని చేరవచ్చును.
రవాణా సౌకర్యం
సింహాచలం రైల్వేస్టేషన్
సింహాచల క్షేత్రం విశాఖపట్నం ద్వారా నౌకా, రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో అనుసంధానమై ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కేవలం 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్ స్టేషన్ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలానికి 5 కి.మీల దూరంలో గోపాలపట్నం వద్ద సింహాచలం రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి సింహాచలానికి విస్తృత రవాణా సదుపాయం ఉంది. అన్ని చోట్ల నుంచి నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా వుంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్ రుసుము చెల్లించి ఆ వాహనాల్లోనే చేరుకోవచ్చు. కొండ పైకి చేరుకునేందుకు దేవస్థానం వారు నాలుగు, ఆర్టీసీ వారు 20 బస్సులు నడుపుతున్నారు. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఇక చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఇతర దర్శనీయ స్థలాలు
ఆండాళ్ సన్నిధి(గోదాదేవి), సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి ఆలయం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం, శ్రీసీతారామస్వామి ఆలయం, గంగాధర, అడివివరం గ్రామం నుంచి 3 కి.మీల దూరంలో భైరవస్వామి సన్నిధి, కొండ దిగువన వరాహ పుష్కరిణి, కొండ మెట్ల మార్గంలో ఆంజనేయ స్వామి ఆలయం, కొండపై శ్రీకృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం, సింహాచలానికి 8 కి.మీ దూరంలో శ్రీమాధవ స్వామి, వేణుగోపాల స్వామి, మల్లికార్జున స్వామి ఆలయాలు ఇక్కడికొచ్చే పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
పరిసరాల్లోని దర్శనీయ స్థలాలు
ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్న విశాఖపట్నం, భీమిలి బీచ్, తొట్లకొండ బౌద్ధారామం, తదితరాలు ఉన్నాయి. ఇవి కాక, ఆంధ్రా వూటీగా పేరున్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బొర్రా గుహలు, అరకులోయ (సుమారు 100 కి.మీ) వెళ్లడమూ సౌలభ్యంగా ఉండటం సింహాచలం వచ్చే పర్యాటకులకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు
Vaasavi.net A complete aryavysya website