Guru

వ్యాసపౌర్ణమి #గురుపౌర్ణమి

ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే పర్వదినం వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. చాలా మంది తెలియక ఎలా పడితే ఆలా ఎవరికి పడితే వారికి పూజ చేస్తున్నారు. అసలు గురు పూజ మొదట ఎవరికీ చెయ్యాలి ఎలా చెయ్యాలి అని పెద్దలు ఒక పద్దతిని తీసుకొనివచ్చారు. అదే వ్యాస పౌర్ణమి నాడు జగద్గురువులైన వేదవ్యాసులవారికి చేసే గురు పూజ. సాధారణంగా గురుస్వరూపాలకి ఆరాధన ప్రక్రియ లేదు కానీ ఏ మహాపురుషుడి వలన వేద విభాగం జరిగిందో, సమస్త వాఙ్మయం భూమిమీదకు వచ్చిందో అట్టి జగద్గువులైన వేదవ్యాసులవారికి శిష్యులు మరియు మిగతా గురు పరంపర అంతా కలిసి ఒకరోజు కృతజ్ఞతగా పూజ చేస్తారు. అదే గురు పౌర్ణమి. పువ్వు జ్ఞానానికి గుర్తు. కాబట్టి అటువంటి జ్ఞానం మనందరికీ కలగాలని ఆరోజున శ్రీకృష్ణ పరమాత్మ ఫోటోని, వ్యాసుల వారి ఫోటోని కానీ లేదా వ్యాస పాదుకల దగ్గర శిష్యులు, మిగతా గురుపరంపర ఒక్కో పువ్వుని సమర్పిస్తారు.

వేద వ్యాస మహర్షుల వారు మన జాతికి చేసిన సేవ అంతా యింతా కాదు. కలియుగంలో వేదాన్ని పూర్తిగా చదవలేరని, కనీసం అర్ధం కూడా చేసుకోలేని రోజులువస్తాయని భవిష్యత్తు దర్శనం చేసి ఒక వేదాన్నినాలుగు వేదాలుగా విభజించి, అవి కూడా పఠనం చేయలేకపోతారేమోనని అష్టాదశ పురాణాలను పంచి పెట్టారు, పంచమ వేదమైన మహాభారత ఇతిహాసాగ్రంధాన్ని ఇచ్చి ఒక్కొక్క వేదాన్ని ఒక్కో శిష్యుడి ద్వారా ప్రచారం గావించి, పురాణాలను శూత మహర్షుల చేత ప్రచారం చేయించారు . ఒకవేళ కలియుగంలో ఈ గ్రంధాలని కూడా మనుషులు అర్ధం చేస్కోగలరో లేదో అన్న దూరదృష్టితో సమస్త వేద, పురాణ, ఉపనిషదుల యొక్క సారాంశమైన శ్రీకృష్ణ భగవానుడి కథలను, హరి నామ వైభవాన్ని శ్రీమద్భాగవతంలో నిక్షిప్తం చేసి ఎప్పుడు భక్తితత్పరతతో ఉండే తన కుమారుడైన శుకమహర్షుల వారి చేత ప్రచారంగావింపబడి సమస్త మానవాళిని ఉద్ధరించిన మహాపురుషుడు వ్యాస మహర్షి.

వ్యాసుమహర్షుల వారు ఇచ్చిన వాఙ్మయాని ఆధారం చేసుకొని తర్వాతి కాలంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, అన్నమాచార్య, రామదాస, మహర్షులవంటి మహాత్ములు గురుపరంపరగా భగవానుడి యొక్క కథలను, గుణవిశేషాలను శిష్యులకి ప్రచారం గావించి సనాతనధర్మాన్నిమానవాళికి అందించారు, అందిస్తున్నారు.

సమస్త వాఙ్మయం వ్యాస ఉచ్చిష్టమ్ అంటారు పెద్దలు అంటే ఎవరు ఏ వాఙ్మయాన్ని చెప్పిన అది వ్యాసులవారు ఏది చెప్పారో దాని నుంచే చెప్పబడింది తప్ప వేరుగా ఏది లేదు అని. అంత గొప్ప వాఙ్మయాన్ని ఇచ్చారు. మనకి ఇంతటి భక్తి, జ్ఞాన బోధనలు చేసి, గురు పరంపరను తీస్కొని వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారంగావించిన అటువంటి మహాపురుషుడికి గురుపౌర్ణమి రోజున పూజ చేసుకోవడం మన అదృష్టం. శ్రీమన్నారాయణుడి అంశావతారమైన వ్యాస మహర్షులవారిని గురు పౌర్ణమి రోజున కేవలం స్మరించినంత మాత్రాన మన పాపరాశి దగ్దమైపోతుంది.
శ్రీ గురుభ్యోనమః

By adm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *